ఘనంగా శ్రీ పాదరావు 89వ జయంతి వేడుకలు
శివాలయంలో మహా అన్నదానం నిర్వహణ
గాంధీ చౌరస్తాలో నివాళులు, కేక్ కటింగ్
ప్రజా నాయకుడిగా చిరస్మరణీయ సేవలు గుర్తు చేసిన నాయకులు
కాకతీయ, జమ్మికుంట: జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకరి రమేష్ ఆధ్వర్యంలో స్వర్గీయ శ్రీ పాదరావు 89వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని శివాలయం బొమ్మల గుడిలో మహా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గాంధీ చౌరస్తాలో శ్రీ పాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా సుంకరి రమేష్ మాట్లాడుతూ 1935 మార్చి 2న కాటారం మండలం ధన్వాడ గ్రామంలో జన్మించిన శ్రీ పాదరావు ప్రజాసేవకు అంకితభావంతో జీవించారని పేర్కొన్నారు. పంచాయతీ ఇన్స్పెక్టర్‌గా సేవలందించి గ్రామ పరిపాలనపై లోతైన అవగాహన పొందిన ఆయన, న్యాయవాదిగా కూడా సేవలందిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారని చెప్పారు.రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన లేకపోయినా ప్రజల కోరికతో ప్రజా జీవనంలోకి అడుగుపెట్టి రెండుసార్లు సర్పంచిగా, సమితి అధ్యక్షుడిగా, అనంతరం మూడుసార్లు ఎమ్మెల్యేగా సేవలందించారని గుర్తుచేశారు. 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఆయన ప్రజాదరణకు నిదర్శనమని అన్నారు.మంథని నియోజకవర్గ అభివృద్ధికి రహదారులు, సాగునీరు, విద్యాసంస్థలు, సంక్షేమ కార్యక్రమాల ద్వారా రూపురేఖలు మార్చిన నాయకుడిగా శ్రీ పాదరావు చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. ఆయన అడుగుజాడల్లో దుద్దిళ్ల కుటుంబ సభ్యులు ప్రజాసేవ కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పలు కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు, యువజన కాంగ్రెస్ ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


