ప్రజల గొంతుకగా ‘కాకతీయ’కు ప్రత్యేక గుర్తింపు
కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్
2026 కాకతీయ క్యాలెండర్ ఆవిష్కరణ
కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి : సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ, విలువైన కథనాలను అందించడంలో ‘కాకతీయ’ దినపత్రిక పాత్ర మరువలేనిదని కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ అన్నారు. ప్రజా కథనాలతో సంచలనం సృష్టిస్తూ డిజిటల్ జర్నలిజంలో ముందంజలో సాగుతున్న కాకతీయ దినపత్రిక ముద్రించిన నూతన సంవత్సర 2026 క్యాలెండర్‌ను శనివారం కొత్తగూడెం డీఎస్పీ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, కాకతీయ దినపత్రిక ప్రజా సమస్యలపై మరింత దృష్టి సారించి ప్రభుత్వాలకు–ప్రజలకు మధ్య వారధిగా నిలవాలని ఆకాంక్షించారు. సమాజానికి మేలు చేకూరేలా సమతుల్యమైన వార్తా కథనాలను అందిస్తూ ముందుకు సాగాలని సూచించారు.
డిజిటల్ జర్నలిజంలో కొత్త ప్రమాణాలు
డిజిటల్ రంగంలో కాకతీయ కొత్త ప్రమాణాలను నెలకొల్పిందని ప్రశంసించిన డీఎస్పీ, ప్రజల సమస్యలను నిస్పాక్షికంగా ప్రస్తావించే జర్నలిజం ద్వారా ఈ పత్రిక ప్రత్యేక గుర్తింపును సంపాదించిందని అన్నారు. నూతన సంవత్సర సందర్భంగా పత్రిక యాజమాన్యానికి, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా విలువలతో కూడిన జర్నలిజాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో త్రీటౌన్ సీఐ శివప్రసాద్, కాకతీయ దినపత్రిక స్టాఫ్ రిపోర్టర్ సతీష్, రిపోర్టర్లు సీమకుర్తి రామకృష్ణ, ప్రభాకర్ రెడ్డి, హరి, సామాజిక సేవ కార్యకర్త గుగులోత్ రూప్ల నాయక్ తదితరులు పాల్గొన్నారు.


