- కేసుల రాజీకి న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలి
- సంస్థ జిల్లా చైర్మన్ రాజగోపాల్
కాకతీయ, ఖమ్మం: ఈ నెల 15న ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు, రాజీ చేసుకోవాలనుకునే వారు దీనిని సద్వినియోగం చేసుకొని కోర్టు కేసుల నుంచి ఉపశమనం పొందాలని జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి.రాజ గోపాల్ అన్నారు. ఖమ్మం జిల్లా కోర్టులోని న్యాయ సేవా సదన్ లో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహణపై జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ సోమవారం పోలీసు, బ్యాంకర్లు, చిట్ ఫండ్ ప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా రాజ గోపాల్ మాట్లాడుతూ.. లీగల్ సర్వీస్ అథారిటీ తరఫున ప్రతి మూడు నెలలకు ఒకసారి జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
రాజీ చేసుకోవాలనుకునే వారికి లోక్ అదాలత్ ఒక వేదికగా నిలుస్తుందని అన్నారు. లోక్ అదాలత్ పట్ల గ్రామీణ ప్రజలకు విస్తృతంగా ప్రచారం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నవంబర్ 15న జిల్లాలోని అన్ని కోర్టులలో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తారన్నారు. సమావేశంలో మొదటి అదనపు జిల్లా జడ్జి ఉమ, న్యాయమూర్తులు, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు టి. వెంకటేశ్వర రావు, నామినేటెడ్ సభ్యులు న్యాయవాదులు శ్రీనివాసరావు, సంధ్యారాణి, పోలీస్, ఎక్సైజ్, బ్యాంక్ అధికారులు, న్యాయవాదులు, చిట్ ఫండ్, ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.


