- అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించిన కలెక్టర్ జితేష్ పాటిల్
కాకతీయ, కొత్తగూడెం రూరల్: విద్యార్థుల సౌకర్యాలు, వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ తెలిపారు. సోమవారం పాత కొత్తగూడెం ప్రాంతంలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలను కలెక్టర్ సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం, వంటశాల, శానిటేషన్ వ్యవస్థలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆహార నాణ్యత, శుభ్రత మెనూ వివరాలపై కలెక్టర్ ఆరా తీశారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణలో పోషకాహారం ముఖ్యమైన పాత్ర వహిస్తున్నందున ప్రతి రోజూ నాణ్యమైన ఆహారం అందేలా చూడాలన్నారు. కలెక్టర్ గుడ్లు వండుతున్నారా..? అని ప్రశ్నించినప్పుడు సిబ్బంది, టెండర్ సంస్థ నుండి సరఫరా లభించలేదని తెలిపారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ జిల్లావ్యాప్తంగా ఉన్న యూఆర్‌ఎస్ కేజీబీవీఎస్ పాఠశాలల్లో కూడా ఇటువంటి సమస్యలు ఉన్నాయో గుర్తించి, తక్షణమే నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
ఆహార సరఫరాలో ఎటువంటి అంతరాయం రాకుండా నాణ్యతతో కొనసాగించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాల పరిధిలోని మరుగుదొడ్లు, స్నానగదులు, హాస్టల్ గదులను కలెక్టర్ పరిశీలించారు. పాఠశాల ఆవరణలో నిల్వ నీరు ఉన్న ప్రాంతాలను శుభ్రపరచి దోమల పెరుగుదలను నివారించడానికి సమయానుకూల చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల హాజరు, విద్యా ప్రమాణాలు, క్రమశిక్షణ వంటి అంశాలను కలెక్టర్ సవివరంగా తెలుసుకున్నారు. సౌకర్యవంతమైన వాతావరణంలో చదువుకునేలా చూడటం మన అందరి బాధ్యత అని కలెక్టర్ అన్నారు. పాఠశాలను నూతన భవనంలోకి మార్చడం లేదా కొత్త ప్రదేశంలో కొత్త భవనం నిర్మించడం కోసం చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. పాఠశాల పరిశుభ్రతను మెరుగుపరచడానికి ఎలక్ట్రికల్ క్లీనింగ్ మెషిన్‌ను అందించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట సెక్టోరియల్ అధికారి ఏ.నాగరాజ శేఖర్, ఏఈ రాజమౌళి, పాఠశాల ప్రత్యేక అధికారి రాంబాయి, సిబ్బంది ఉన్నారు.


