సోనియాగాంధీకి అస్వస్థత!
దీర్ఘకాలిక దగ్గుతో బాధపడుతున్న కాంగ్రెస్ అగ్రనేత
ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరిక
సాధారణ వైద్య పరీక్షల కోసమేనని డాక్టర్లు స్పష్టం
ఢిల్లీ కాలుష్యమే ఆరోగ్య సమస్యలకు కారణం
కాకతీయ, నేషనల్ బ్యూరో : కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ అస్వస్థతకు గురయ్యారు. దీర్ఘకాలిక దగ్గు సమస్యతో బాధపడుతున్న ఆమెను ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్య వర్గాలు వెల్లడించాయి. ఛాతీ వైద్యుల పర్యవేక్షణలో పలు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇది పూర్తిగా సాధారణ పరీక్షలలో భాగమేనని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు స్పష్టం చేశారు. సోనియాగాంధీ గత కొంతకాలంగా దీర్ఘకాలిక దగ్గుతో బాధపడుతున్నారని, ముఖ్యంగా ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగానే ఆమె తరచూ వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఆమె వయస్సు 79 సంవత్సరాలు కావడంతో వైద్యులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
పార్లమెంటులోనే కాలుష్యంపై ఆవేదన
ఇదివరకే ఢిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకీ క్షీణిస్తుండటంపై సోనియాగాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వాయు కాలుష్యంతో పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారని, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మాస్కులు ధరించి ప్రకటనలు చేయడం కాకుండా, వాస్తవ చర్యలు తీసుకోవడంపై దృష్టి పెట్టాలని ప్రతిపక్షాలు పార్లమెంట్ ఆవరణలో ప్లకార్డులతో నిరసనలు తెలిపాయి. ఈ నిరసనల్లో సోనియాగాంధీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా పాల్గొన్నారు.
కాలుష్య నియంత్రణకు కఠిన చర్యలు
కాలుష్య నియంత్రణ మండలి వివరాల ప్రకారం గాలి నాణ్యత సూచిక (AQI) 101 నుంచి 200 మధ్య ఉంటే గాలి నాణ్యత మోస్తరుగా ఉన్నట్లు భావిస్తారు. 201 నుంచి 300 మధ్య ఉంటే ‘పేలవంగా’, 301 నుంచి 400 మధ్య ఉంటే ‘చాలా పేలవంగా’గా పరిగణిస్తారు. ఏక్యూఐ 400 దాటితే గాలి నాణ్యత తీవ్రంగా దిగజారినట్లే. 450 దాటితే అతితీవ్ర స్థాయి, 500 లేదా అంతకంటే ఎక్కువ నమోదైతే అత్యంత ప్రమాదకర స్థాయిగా గుర్తిస్తారు. ఈ నేపథ్యంలోనే రాజధానిలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. కాలుష్య నియంత్రణ ధ్రువపత్రం (PUC) లేని వాహనాలకు పెట్రోల్ స్టేషన్లలో ఇంధనం అందించకూడదని నిర్ణయించింది. అలాగే ఢిల్లీ బయట రిజిస్టర్ అయిన బీఎస్-4 ప్రమాణాలు పాటించని వాహనాలకు నగరంలోకి అనుమతి లేదని స్పష్టం చేసింది. ఈ నిబంధనలను అమలు చేయడానికి ఢిల్లీ సరిహద్దుల్లో పోలీస్, రవాణా శాఖ ప్రత్యేక బృందాలను మోహరించారు.


