సామాజిక అసమానతలే ఓల్గా స్త్రీవాదానికి గమ్యం
పిత్రృస్వామిక అణచివేతపై సాహిత్య ప్రతిఘటన
కేంద్ర సాహిత్య అకాడమీ ఎగ్జిక్యూటివ్ సభ్యురాలు ఆచార్య సి. మృణాళిని
కాకతీయ, ఖమ్మం : సామాజిక అసమానతలు, పిత్రృస్వామిక భావజాల అణచివేతలే ఓల్గా రచనల స్త్రీవాద గమ్యంగా, గమనంగా మారాయని ప్రముఖ సాహిత్య విశ్లేషకురాలు, విశ్రాంత ఆచార్యులు, కేంద్ర సాహిత్య అకాడమీ ఎగ్జిక్యూటివ్ సభ్యురాలు, తెలుగు విభాగ కన్వీనర్ ఆచార్య సి. మృణాళిని అన్నారు. ఆదివారం ఖమ్మంలో స్వేచ్ఛావరణం ఆధ్వర్యంలో ‘ఖమ్మం కళా ఉత్సవం’ పేరుతో నిర్వహించిన ఓల్గా 75వ జయంతి సందర్భంగా జరిగిన సాహిత్య సమాలోచన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని కీలకోపన్యాసం చేశారు. ఓల్గా తన కథలు, నవలలు, కవిత్వం, వ్యాసాలు, సంపాదకీయాలు, సీరియల్స్ ద్వారా స్త్రీల హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం అంశాలను బలంగా ప్రతిపాదించారని ఆచార్య మృణాళిని పేర్కొన్నారు. జెండర్ వివక్ష లేని మానవ హక్కుల కోసం ఆమె చేసిన రచనా ప్రయాణం తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందన్నారు. స్త్రీవాద అస్తిత్వ స్పృహతో అనేక సాహిత్య ప్రక్రియలను ఓల్గా పరిపుష్టం చేశారని తెలిపారు.
సమాజాన్ని ప్రశ్నించిన రచనలు
ప్రముఖ కథా రచయిత్రి వి. ప్రతిమ మాట్లాడుతూ… ఓల్గా రచనలు స్త్రీల సాధికారతకు, అస్తిత్వ చైతన్యానికి ప్రతీకలుగా నిలిచాయని చెప్పారు. కుటుంబ, రాజకీయ, సాంస్కృతిక వ్యవస్థల్లో దాగి ఉన్న అసమానతలను ఆమె రచనలు బహిర్గతం చేశాయన్నారు. కార్యక్రమ సమన్వయకర్త సుమతి లక్ష్య ప్రకటన చేయగా, ఓల్గా గత ఐదు దశాబ్దాల రచనల సారాంశ పోస్టర్ ప్రదర్శనను అడ్వకేట్ పి. సంధ్యారాణి ప్రారంభించారు. అనంతరం ‘ఓల్గాతీరం’ పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో రచయిత్రులు పాటి బండ్ల రజని, సభాధ్యక్షురాలు వి. సునంద, డా. కె. ఆనందవాణి, డా. నాగమణి, డా. జతిన్ కుమార్, అక్కినేని కుటుంబరావు రవిమారుత్ తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు నిర్వహించిన ‘ఓల్గా రాజకీయ కథలు – విశ్లేషణ’ వ్యాసరచన పోటీల విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. చివరగా ఓల్గా స్పందిస్తూ… సమాజంలోని సామాజిక సంక్లిష్టతే తన రచనల నేపథ్యమని, స్త్రీల మధ్య సహకారం పెరగాలని, నిర్ణయాధికారం స్త్రీల చేతుల్లో ఉండాలనే ఆశయంతోనే తన రచనలు కొనసాగుతున్నాయని తెలిపారు.


