వీఏఓలకు స్మార్ట్ఫోన్లతో గ్రామాభివృద్ధికి మార్గం
గ్రామీణ పేదరిక నిర్మూలనకు టెక్నాలజీ తోడ్పాటు
వీఏఓల పనితీరులో వేగం, పారదర్శకత లక్ష్యం
శామ్సంగ్ ఏ06 మోడల్ ఫోన్ల పంపిణీకి సిద్ధం
డ్వాక్రా వ్యవస్థ బలోపేతానికి మరో అడుగు
డేటా సేకరణ, బ్యాంక్ లింకేజీలకు ఉపయోగం
మంత్రి కొండపల్లి శ్రీనివాస్
కాకతీయ, అమరావతి ప్రతినిధి : గ్రామీణ పేదరిక నిర్మూలనలో కీలక పాత్ర పోషిస్తున్న గ్రామ సంఘ సహాయకులకు స్మార్ట్ఫోన్లు అందించడం ద్వారా వారి పనితీరును మరింత సమర్థవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గ్రామీణ అభివృద్ధిలో టెక్నాలజీ కీలకమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సంఘ సహాయకులుగా పనిచేస్తున్న వీఏఓలకు స్మార్ట్ఫోన్లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదంతో ఈ ప్రక్రియ వేగం అందుకుంది. అమరావతిలో గురువారం ఈ అంశంపై మంత్రి వివరాలు వెల్లడించారు. మంత్రి మాట్లాడుతూ గతంలోనే వెలుగు పథకం ద్వారా గ్రామీణ మహిళల జీవన స్థాయిని మెరుగుపరిచే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని గుర్తుచేశారు. డ్వాక్రా సంఘాల ద్వారా లక్షలాది మహిళలు స్వయం ఉపాధి దిశగా అడుగులు వేసినట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో భారీ సంఖ్యలో మహిళలు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నారని చెప్పారు.
డ్వాక్రా నుంచి డిజిటల్ దిశగా
గ్రామ స్థాయిలో సంఘ సభ్యులకు శిక్షణ ఇవ్వడం, బ్యాంక్ లింకేజీలు కల్పించడం, స్త్రీనిధి, సీఐఎఫ్ వంటి పథకాలను అమలు చేయడంలో వీఏఓలు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని మంత్రి వివరించారు. ఈ క్రమంలో వారికి డిజిటల్ పరికరాలు అవసరమయ్యాయని తెలిపారు. గ్రామాల్లో డేటా సేకరణ, ప్రభుత్వ పథకాల అమలులో సాంకేతిక సహకారం అవసరం పెరిగిందన్నారు. వీఏఓల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు స్మార్ట్ఫోన్ల పంపిణీ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. గతంలో ట్యాబ్‌లు ఇచ్చిన అనుభవాన్ని గుర్తుచేస్తూ, ఇప్పుడు ఆండ్రాయిడ్ అప్లికేషన్ల వినియోగం పెరగడంతో స్మార్ట్ఫోన్లు అవసరమయ్యాయని వివరించారు.
ఫీల్డ్ వర్క్‌కు స్మార్ట్ సపోర్ట్
ఈ ఫోన్లు శామ్సంగ్ ఏ06 మోడల్లో అందించనున్నట్లు మంత్రి తెలిపారు. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, అవసరమైన సాఫ్ట్‌వేర్‌తో ఇవి ఉంటాయని చెప్పారు. ప్రతి ఫోన్లో ఎండీఎం సాఫ్ట్వేర్ అమర్చడం ద్వారా వినియోగాన్ని పర్యవేక్షించనున్నట్లు వెల్లడించారు. స్మార్ట్ఫోన్ల ద్వారా వీఏఓలు ఫీల్డ్‌లోనే సమాచారం నమోదు చేయగలరని, పథకాల అమలు వేగవంతం అవుతుందని మంత్రి తెలిపారు. బ్యాంక్ లింకేజీలు, ఆర్థిక సహాయం, డేటా నిర్వహణ వంటి పనులు సులభమవుతాయని చెప్పారు. ఈ ఫోన్ల కొనుగోలును ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ద్వారా పారదర్శక టెండర్ విధానంలో నిర్వహించినట్లు తెలిపారు. ప్రభుత్వం పారదర్శకతకు ప్రాధాన్యం ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ నిర్ణయం గ్రామీణ అభివృద్ధిలో కీలక మలుపు అవుతుందని, మహిళా సంఘాల బలోపేతానికి దోహదపడుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.


