నైపుణ్యాలే యువత భవిష్యత్తుకు పునాది
స్కిల్ పెంపుదలతోనే ఉపాధి అవకాశాలు
అప్రెంటిస్‌షిప్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్
కాకతీయ, కొత్తగూడెం : వృత్తి నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకుంటేనే యువత తమ భవిష్యత్తును అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లగలరని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. యువతలో స్కిల్ డెవలప్‌మెంట్ పెంపొందించాలనే లక్ష్యంతోనే జిల్లా యంత్రాంగం వివిధ శిక్షణ కార్యక్రమాలను చేపడుతోందని తెలిపారు. శనివారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ఓరియెంటేషన్ అండ్ సెలక్షన్ ప్రోగ్రామ్‌కు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. లెర్నెన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఎంఆర్ఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఎన్‌ఏఎఫ్‌ఎస్ స్కీమ్ ద్వారా అప్రెంటిస్‌షిప్ శిక్షణతో పాటు రానే (మద్రాస్) లిమిటెడ్ సంస్థ ద్వారా సిఎన్‌సి మిషన్లపై రెండు సంవత్సరాల వోకేషనల్ శిక్షణ అందిస్తున్నట్లు వివరించారు.
ఉచిత శిక్షణతో 100% ప్లేస్‌మెంట్
ఈ అప్రెంటిస్‌షిప్‌లో ఉచిత శిక్షణతో పాటు స్టైపెండ్, 100 శాతం ప్లేస్‌మెంట్ సపోర్ట్ కల్పిస్తున్నట్లు తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మల్టీ స్కిల్స్ అవసరమని, యువత నిరంతరం నేర్చుకునే దృక్పథాన్ని అలవర్చుకోవాలని సూచించారు. తన చిన్ననాటి అనుభవాలను పంచుకున్న కలెక్టర్, పేద కుటుంబ నేపథ్యం నుంచి కష్టపడి ఎదిగినట్లు చెప్పారు. కష్టాలకు భయపడి ఆగిపోతే విజయం దక్కదని, ఓర్పుతో ముందుకు వెళ్లిన వారే లక్ష్యాన్ని సాధిస్తారని తెలిపారు. జనవరి 21న మరోసారి ట్రైనింగ్ అండ్ సెలక్షన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.


