ఆరుగురు మావోయిస్టుల లొంగుబాటు
మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పిలుపు
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన ఆరుగురు సభ్యులు గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఎదుట లొంగి పోయారు. మిలీషియా సభ్యులు పొడియం దేవా, మడకం ఇడుమస్, మడకం ముక, ఇత మాధవి, ఎల్ వో ఎస్ కమాండర్ మడకం దేవా, పార్టీ మెంబర్ జోగా మాధవిలు స్వచ్ఛందంగా లొంగిపోయినట్లు ఎస్పీ వివరించారు. గతంలో లొంగిపోయిన సభ్యులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ కల్పిస్తున్న సదుపాయాల గురించి తెలుసుకొని ఆరుగురు లొంగుబాటుకు ముందుకొచ్చారని అన్నారు. లొంగిపోయిన ఆరుగురు మావోయిస్టు దళ సభ్యులకు తక్షణ సహాయంగా ప్రతి ఒక్కరికి రూ.25 వేల చొప్పున మొత్తం నగదు రూ.1,50,000 ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. తదుపరి వారి ర్యాంకుల వారిగా మిగతా నగదును ఆధార్ కార్డులు, బ్యాంక్ అకౌంట్లలో జమ చేయడం జరుగుతుందన్నారు.
జనజీవన స్రవంతిలో కలవాలి
మావోయిస్ట్ పార్టీ సభ్యులు జనజీవన స్రవంతిలో కలవాలని ఎస్పీ రోహిత్ రాజు పిపునిచ్చారు. ప్రభుత్వం పోలీసు శాఖ ఆదివాసీల అభివృద్ధి సంక్షేమం కొరకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఆదివాసి ప్రాంతాలలో రోడ్లు, పాఠశాలలు, వైద్యశాలలు, తాగునీరు, విద్యుత్తు సౌకర్యాలు ఇలా అనేక వసతులు కల్పించినట్లుగా పేర్కొన్నారు. ప్రతి మారుమూల గిరిజన ప్రాంతానికి నాణ్యమైన విద్య వైద్య సౌకర్యాలు కల్పించడానికి పోలీసు శాఖ విశేష కృషి చేస్తోందన్నారు.


