- సీఎండీ ఎన్.బలరామ్ ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ
కాకతీయ, కొత్తగూడెం రూరల్: సింగరేణి సంస్థలో బదిలీ వర్కర్లుగా చేరి భూగర్భ గనులు, ఓపెన్ కాస్ట్ గనులు లేదా సర్ఫేస్ లో పనిచేస్తూ 190/240 మస్టర్లు పూర్తి చేసిన వారిని జనరల్ అసిస్టెంట్ కేటగిరి-1గా క్రమబద్ధీకరించేందుకు వీలుగా సింగరేణి యాజమాన్యం బుధవారం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ మేరకు సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
2024 డిసెంబర్ 31, అంతకు ముందు తమ సంవత్సరకాలం సర్వీసు చేసిన వారిని భూగర్భ గనుల్లో అయితే 190 మస్టర్లు, ఓపెన్ కాస్ట్ గనుల్లో లేదా సర్ఫేస్ లో అయితే 240 మస్టర్లు పూర్తి చేసి ఉన్న బదిలీ వర్కర్లను జనరల్ అసిస్టెంట్ కేటగిరి-1గా క్రమబద్ధీకరించడానికి యాజమాన్యం అంగీకరించిందని పేర్కొన్నారు. ఈ క్రమబద్ధీకరణ విషయమై సింగరేణి సిఎండీగా తాను, సింగరేణి డైరెక్టర్(పా)గౌతమ్ పొట్రులతో గుర్తింపు కార్మిక సంఘం అయిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ జరిపిన చర్చల అనంతరం యాజమాన్యం ఈ సానుకూల నిర్ణయం తీసుకుందన్నారు.
రామగుండం-2 ఏరియాలో 303 మంది బదిలీ వర్కర్లను జనరల్ అసిస్టెంట్ కేటగిరి-1గా క్రమబద్దీకరణ చేశారు. భూపాలపల్లి ఏరియాలో 250 మందికి, శ్రీరాంపూర్ లో 241 మందికి, రామగుండం-3 అడ్రియాలలో 167 మందికి, రామగుండం-1లో 156 మందికి, మందమర్రిలో 64 మందికి, కార్పోరేట్ లో 21 మందికి, కొత్తగూడెంలో 20 మందికి, మణుగూరులో 19 మందికి, బెల్లంపల్లిలో 11 మందికి, ఇల్లందు ఏరియాలో ఆరుగురికి జనరల్ అసిస్టెంట్ కేటగిరి-1గా క్రమబద్ధీకరించే ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిపారు.


