సైలెన్స్ పీరియడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి
ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఖమ్మం పోలీస్ కమిషనర్
కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సోమవారం సాయంత్రం 5 గంటలతో ఎన్నికల ప్రచారం ముగిసిందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ప్రచారం ముగిసిన వెంటనే సైలెన్స్ పీరియడ్ అమల్లోకి వచ్చిందని స్పష్టం చేశారు. ఈ సమయంలో ఎలాంటి బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్ షోలు, ఇంటింటి ప్రచారం, మైక్‌లు, లౌడ్ స్పీకర్లు, పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు వంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదని హెచ్చరించారు. సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపులు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కూడా ఎన్నికల ప్రచారం చేయడం నిషేధమన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ప్రత్యేక నిఘా బృందాలు ఏర్పాటు చేశామని తెలిపారు. పోలింగ్ రోజు శాంతియుత వాతావరణం కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశామని, సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించామని చెప్పారు. అక్రమ మద్యం రవాణా, నగదు పంపిణీ, బెదిరింపులపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ప్రజలు నిబంధనలు పాటించి పోలీస్ శాఖకు సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.


