ఇసుక అడ్డా కూడలిలో సిగ్నల్స్ లేక ప్రమాదాల పరంపర
సంవత్సరం క్రితం ప్రమాదంలో దెబ్బతిన్న ట్రాఫిక్ సిగ్నల్స్
ఇప్పటికే ఒకరు మృతి, పలువురు గాయాలు
వెంటనే సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని స్థానికుల డిమాండ్
కాకతీయ, ఖిలా వరంగల్: వరంగల్ నగరంలోని ఇసుక అడ్డా కూడలి ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఖమ్మం రోడ్, వరంగల్ అండర్ బ్రిడ్జి, కరిమాబాద్ ప్రాంతాలను కలుపుతూ ఉన్న ఈ కీలక కూడలిలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
సుమారు సంవత్సరం క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ సిగ్నల్స్ దెబ్బతినడంతో వాటిని పక్కన పెట్టారు. అయితే ఇప్పటి వరకు వాటిని పునరుద్ధరించలేదు. ఫలితంగా వాహనాలు నియంత్రణ లేకుండా దూసుకెళ్లడంతో ఇప్పటికే ఒకరు ప్రాణాలు కోల్పోయారని, పలువురు గాయాలపాలయ్యారని స్థానికులు చెబుతున్నారు.
ప్రత్యేకంగా ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ ఎక్కువగా ఉండటంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోంది. చిన్నపాటి ఢీకొన్లు, వాగ్వాదాలు నిత్యకృత్యంగా మారాయి.
ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు తక్షణమే స్పందించి, సిగ్నల్స్‌ను తిరిగి ఏర్పాటు చేయాలని, అవసరమైతే ట్రాఫిక్ సిబ్బందిని నియమించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదాలు మరింత పెరగకముందే అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు


