జాతీయ కబడ్డీ పోటీలకు సిద్దిపేట క్రీడాకారుడు వంశి కృష్ణ ఎంపిక
– మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు
– ఈ నెల 24 నుంచి 27 వరకు గుజరాత్‌లో 72వ సీనియర్ జాతీయ పోటీలు
– జాతీయ స్థాయిలో సత్తా చాటే దిశగా అడుగు
– కబడ్డీలో సిద్దిపేటకు మరో గౌరవం
కాకతీయ, గజ్వేల్ : సిద్దిపేట జిల్లా క్రీడాకారుడు వంశి కృష్ణ 72వ సీనియర్ జాతీయ కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. జిల్లాకు చెందిన క్రీడాకారుడు జాతీయ స్థాయిలో అవకాశాన్ని దక్కించుకోవడం గర్వకారణంగా భావిస్తున్నారు. ఈ 72వ సీనియర్ జాతీయ కబడ్డీ పోటీలు గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో ఈ నెల 24వ నుంచి 27వ వరకు నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో వంశి కృష్ణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వంశి కృష్ణను, తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి, సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కుంటనోళ్ల శివకుమార్‌ను పిలిపించి అభినందించారు. వంశి కృష్ణకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, జిల్లాలో కబడ్డీ క్రీడాకారులను మరింతగా ప్రోత్సహించి దేశానికి ప్రాతినిధ్యం వహించే స్థాయికి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.సీ. సంతోష్ గుప్తా మాట్లాడుతూ… వంశి కృష్ణ ఎంపిక జిల్లాకు గౌరవంగా నిలిచిందన్నారు. రాష్ట్ర కబడ్డీ సంఘం సహకారంతో జిల్లాలో క్రీడాకారులకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు కాసాని వీరేష్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి మద్ది మహేందర్ రెడ్డికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గిరి కొండల్ రెడ్డి, గుద్దలు రమేష్, సంపంగి రాజు, ప్రేమ్ నారాయణ, రంగనాథ్, కోశాధికారి సత్యం, జిల్లా సంయుక్త కార్యదర్శులు నరేంద్ర బాబు, శ్రీకాంత్, మహేష్, కరుణాకర్, కార్యవర్గ సభ్యుడు బాబు తదితరులు హర్షం వ్యక్తం చేశారు.


