కాకతీయ, నేషనల్ డెస్క్: జమ్ముకశ్మీర్ లో చషోటి గ్రామంలో బుధవారం క్లౌడ్ బరస్ట్ పెను విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. క్లౌడ్ బరస్ట్ కారణంగా పదుల సంఖ్యలో జనం మరణించారు. దాదాపు 200 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం నాటికి మృతుల సంఖ్య 46 నుంచి 60కి చేరుకుంది. మరణించినవారిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు ఉన్నారు. మరణించినవారి సంఖ్య మరింత అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఆర్మీ కూడా సహాయ చర్యల్లో పాల్గొన్నది. ఇప్పటి వరకు 160 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు.
ప్రధాని మోదీ ఉదయం జమ్ము కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాలతో ఈ విషాదంపై మాట్లాడారు. అక్కడి పరిస్థితులను ప్రధాని అడిగి తెలుసుకున్నారు. అవసరమైనంత వరకు సాయం చేస్తానని మోదీ ప్రకటించారు. ఈ మేరకు ఒమర్ అబ్దుల్లా తన ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టారు. ఆ పోస్టులో ఇప్పుడే ప్రధాని మోదీ నుంచి కాల్ వచ్చింది. కిస్త్ వార్ లోని పరిస్థితుల గురించి ఆయనకు వివరించారు. అధికారులు తీసుకుంటున్న చర్యలను కూడా వివరించారు. ఆయన మద్దతు సాయానికి మా ప్రభుత్వం, బాధిత ప్రజలు రుణపడి ఉంటారని పేర్కొన్నారు.


