బీఆర్ఎస్ పాలనలో చేర్యాలకు అవమానం
రెవెన్యూ డివిజన్ సాధన ఉద్యమకారులను హేళన చేసింది
మున్సిపల్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలి
కాంగ్రెస్ 7వ వార్డు అభ్యర్థి పోతుగంటి ప్రసాద్ పిలుపు
కాకతీయ, చేర్యాల : చేర్యాల ప్రాంతాన్ని అభివృద్ధికి దూరం చేసి ప్రజలను అవమానించిన బీఆర్ఎస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ 7వ వార్డు అభ్యర్థి పోతుగంటి ప్రసాద్ పిలుపునిచ్చారు. బుధవారం 7వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఆయన, కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి ప్రజల సంక్షేమాన్ని కోరే పాలనకు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ, గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో చేర్యాల ప్రాంతం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్నారు. అభివృద్ధి చేయాల్సింది పోయి ప్రజల సమస్యలను పట్టించుకోని బీఆర్ఎస్ నాయకులకు ఇప్పుడు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని తీవ్రంగా విమర్శించారు. చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలంటూ ప్రజలు, ఉద్యమకారులు ఎన్నో సంవత్సరాలుగా పోరాటాలు చేస్తే, అప్పటి బీఆర్ఎస్ నాయకులు ఉద్యమకారులను హేళన చేసి అవమానించారని గుర్తుచేశారు. రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కావడాన్ని అడ్డుకున్న చరిత్ర బీఆర్ఎస్దేనని ఆరోపించారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించబోతున్నారని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పశువుల అంగడి, మాత్తడి స్థలాలను కబ్జా చేసిన మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి స్థానిక బీఆర్ఎస్ నాయకులు వత్తాసు పలికారని మండిపడ్డారు. అంగడి బజార్‌లోని షెడ్లను కూల్చివేసి చిరు వ్యాపారుల జీవనోపాధిని దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. చేర్యాలను అభివృద్ధి పేరుతో నాశనం చేసిన బీఆర్ఎస్ నాయకుల నిజస్వరూపాన్ని ప్రజలు గుర్తించాలని, తెలంగాణలో త్వరలోనే బీఆర్ఎస్ దుకాణం మూతపడటం ఖాయమని పోతుగంటి ప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు.


