షాడో ఉద్యోగి హడావుడి
పైరవీలతో మళ్లీ ఖమ్మం కార్పొరేషన్లో తిష్ట
గతంలో పోలీస్ కేసులు, ప్రభుత్వానికి సరెండర్
కింది స్థాయి ఉద్యోగులపై వేధింపుల ఆరోపణలు
జిల్లా కలెక్టర్ జోక్యం కోరుతున్న బాధితులు
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో షాడో అధికారిగా వ్యవహరిస్తూ కింది స్థాయి ఉద్యోగులను వేధిస్తున్న వ్యక్తి మళ్లీ తిష్టవేయడం కలకలం రేపుతోంది. గతంలో ఇదే తరహా ఆరోపణలతో పోలీస్ కేసులు ఎదుర్కొని, కార్పొరేషన్‌కు అవసరం లేదని ప్రభుత్వానికి సరెండర్ చేసిన సదరు ఉద్యోగి పైరవీలతో తిరిగి ఖమ్మంలో పాగా వేసినట్లు ఉద్యోగులు వాపోతున్నారు. కార్యాలయంలో కింది స్థాయి ఉద్యోగుల పనితీరుపై లేనిపోని ఆరోపణలు మోపుతూ, ద్వితీయ స్థాయి అధికారుల వద్ద తప్పుడు సమాచారం ఇచ్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. నిత్యం అధికారుల చుట్టూ తిరుగుతూ తన ప్రభావాన్ని ఉపయోగించుకుంటున్నాడని అంటున్నారు.

మహిళా ఉద్యోగిపై వేధింపులు
గతంలో ఓ మహిళా బిల్ కలెక్టర్‌ను ఉద్దేశపూర్వకంగా వేధించడంతో ఆమె రెవెన్యూ అధికారికి ఫిర్యాదు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. సర్వే విధుల్లో ఉన్న సమయంలో తప్పుడు కారణాలతో కార్యాలయానికి పిలిపించి మానసిక ఒత్తిడికి గురిచేశారని బాధితురాలు ఆరోపించింది. ఈ ఘటనలో ఆమె అస్వస్థతకు గురవ్వడంతో అప్పట్లో ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకున్నట్లు సమాచారం. సదరు షాడో ఉద్యోగిపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో గతంలో సీడీఎంఏకు నివేదిక వెళ్లగా, అప్పటి కమిషనర్ ప్రభుత్వానికి సరెండర్ చేసిన సంఘటనలున్నాయని ఉద్యోగులు గుర్తుచేస్తున్నారు. అయితే ఏడాది వ్యవధిలోనే మళ్లీ కార్పొరేషన్‌కు తిరిగి వచ్చి అదే తీరుగా వ్యవహరిస్తున్నాడని ఆరోపిస్తూ, జిల్లా కలెక్టర్ తక్షణ చర్యలు తీసుకోవాలని బాధిత ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.


