సంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం
అదుపుతప్పి కల్వర్టు గుంతలో పడిన బైక్
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు మృతి
కాకతీయ, సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నారాయణఖేడ్–బీదర్ జాతీయ రహదారి (ఎన్‌హెచ్–161బి)పై నారాయణఖేడ్ శివారులో ఈ ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. నారాయణఖేడ్ శివారులో నూతనంగా నిర్మిస్తున్న హైవే పక్కన ఉన్న కల్వర్టు గుంతలోకి బైక్ అదుపుతప్పి బోల్తా పడింది. కిందపడిన యువకులు తీవ్ర గాయాలు కావడంతో ఘటనాస్థలంలోనే మృతి చెందారు. తెల్లవారుజామున ఈ ఘటన జరగడంతో రహదారిపై వెళ్తున్న వాహనదారులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
మృతులు ఒకే కుటుంబానికి చెందినవారే
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతులు నర్సింహులు (27), మల్లేష్ (24), మహేష్ (23)గా గుర్తించారు. మృతుల్లో ఒకరు బావ కాగా, ఇద్దరు బావమరిదులు. ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందినవారు. నర్సాపూర్ నుంచి నారాయణఖేడ్‌కు వచ్చి తిరిగి నర్సాపూర్ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నారాయణఖేడ్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వద్ద కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ముగ్గురు యువకుల అకాల మరణంతో వారి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


