రెండో విడత గ్రామపంచాయతీ పోలింగ్ ప్రారంభం
ఉదయం నుంచే కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు
కొత్తగూడెం, కాకతీయ రూరల్ : జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైంది. ఎన్నికలు నిర్వహిస్తున్న అన్నపురెడ్డిపల్లి, అశ్వరావుపేట, చంద్రుగొండ, చుంచుపల్లి, దమ్మపేట, ములకపల్లి, పాల్వంచ మండలాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ఉదయాన్నే బారులు తీరారు. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచే ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును ఉత్సాహంగా వినియోగించుకుంటున్నారు. మహిళలు, వృద్ధులు, యువత పోలింగ్‌లో చురుగ్గా పాల్గొంటున్నారు.
అదనపు కలెక్టర్ పర్యవేక్షణ
పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు, పోలింగ్ సరళి, భద్రతా చర్యలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన నారావారి గూడెం గ్రామపంచాయతీ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించారు. పోలింగ్ సిబ్బందితో మాట్లాడి, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విధులు సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నదని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని వారు పేర్కొన్నారు.


