గజ్వేల్ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఘనంగా సైన్స్ ఎక్స్‌పో
– చైర్‌పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్ సందర్శన
– వైస్ చైర్మన్ పద్మా బాయ్ నర్సింగారావు, డాక్టర్ నరేష్ బాబు విద్యార్థులను ప్రశంసించారు
– విద్యార్థుల పర్యావరణ, నీటి, సౌర శక్తి ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి
– ప్రిన్సిపల్ హరిణ్ పవన్: భవిష్యత్తులో మరిన్ని సైన్స్ ఎక్స్‌పోలు
కాకతీయ, గజ్వేల్ : గజ్వేల్ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఘనంగా సైన్స్ ఎక్స్‌పో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్, వైస్ చైర్మన్ పద్మా బాయ్ నర్సింగారావు, డాక్టర్ నరేష్ బాబు సందర్శించి విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు వివిధ శాస్త్రీయ నమూనాలు, ప్రాజెక్టులు, పరిశోధనాత్మక ఆవిష్కరణలను ప్రదర్శించారు. పర్యావరణ పరిరక్షణ, నీటి సంరక్షణ, సౌర శక్తి వినియోగం, ఆరోగ్య సంరక్షణ వంటి సమకాలీన అంశాలపై రూపొందించిన ప్రాజెక్టులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్న వయస్సులోనే శాస్త్ర విజ్ఞానంపై ఆసక్తి చూపిన విద్యార్థులను ఆతిథులు ప్రోత్సహించారు. చైర్‌పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్ మాట్లాడుతూ… విద్యార్థులు చదువుతో పాటు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. విజ్ఞానం జీవితాన్ని మార్చుతుందని, కొత్త ఆవిష్కరణలు సమాజ అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. పిల్లలు తమ ఆరోగ్యం, భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, పాఠశాల, ఇంటి పరిసరాల్లో శుభ్రత పాటించాలి, పెద్దలను గౌరవించడం, గురువులను మర్యాదపూర్వకంగా సంభాషించడం ప్రతి విద్యార్థి కర్తవ్యమని చెప్పారు. క్రమశిక్షణ, సమయపాలన, కష్టపడి చదవడం ద్వారా ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చని విద్యార్థులకు ప్రోత్సాహం ఇచ్చారు. వైస్ చైర్మన్ పద్మా బాయ్ నర్సింగారావు, డాక్టర్ నరేష్ బాబు విద్యార్థుల ప్రతిభను ప్రశంసించారు. ఇలాంటి కార్యక్రమాలు పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ప్రిన్సిపల్ హరిణ్ పవన్ మాట్లాడుతూ ఈ సైన్స్ ఎక్స్‌పో విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా నిలిచిందని, భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.


