- దళితుల మధ్య రిజర్వేషన్ల పేరుతో వర్గపోరుకు నాంది
- శాస్త్రీయత లేని రాష్ట్ర జనాభా లెక్కలతో ఎస్సీ రిజర్వేషన్లు
- మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్
కాకతీయ, ఖమ్మం టౌన్ : ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యతపై దేశవ్యాప్త చరిత్రలోనే అతి పెద్ద రాజకీయ కుట్ర జరిగిందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు, రాక్స్ డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ అన్నారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రత్నాకర్ మాట్లాడారు. దళితులకు రిజర్వేషన్ పేరుతో పడేసే ఎంగిలి మెతుకులేనా.. వర్గీకరణ పేరుతో వాటాలు, సామాజిక న్యాయం? మిగతా వాటికి అక్కర్లేదా?అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి, చంద్రబాబు అనుభవించే ముఖ్యమంత్రి పదవికి సామాజిక న్యాయం అక్కర్లేదా..? వారు జనాభా దామాషా ప్రకారం ముఖ్యమంత్రి పదవులను ఇచ్చేస్తారా అని ప్రశ్నించారు.
ఎస్సీ వర్గీకరణను శాంపుల్ గా పంజాబ్, హర్యానాలో మొదటగా ఈ దేశంలో చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. బీజం కాంగ్రెస్ పార్టీ వేస్తే దీన్ని ప్రధాని మోడీ దేశం మొత్తం చేశాడని విమర్శించారు. శాస్త్రీయత లేని రాష్ట్ర జనాభా లెక్కలతో ఎస్సీ రిజర్వేషన్ వల్ల వందలో నలుగురికే బెనిఫిట్ జరుగుతోందని, ఈ వందలో నలుగురికి ఇచ్చే ఈ ఫలాలను దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్న 1108 ఎస్సీ కులాలకు ఎలా పంచుతారని నిలదీశారు. అలాగే ఈ నాలుగు సీట్లను తెలుగు రాష్ట్రాల్లో 59 ఎస్సీ ఉప-కులాలకు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఎలా పంచుతారు..? ఇది దళితుల ఐక్యతపై కుట్ర కాదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రులు రేవంత్, చంద్రబాబు మాల సామాజిక వర్గంపై కుట్రపన్ని అణిచి వేస్తున్నారని ఆరోపించారు.
ఎస్సీ వర్గీకరణ చట్టాలు అయిపోయినవి కదా, ఇక చేసేదేముందని అనుకోకండి, ప్రజల తలుచుకుంటే ఏ చట్టాలైన ప్రజాస్వామ్యంలో వెనక్కి తీసుకోవాల్సిందేనన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తా ఉంటే మాల ప్రజా ప్రతినిధులు నోరు మెదపకపోవడం, ఘోర అన్యాయమని అన్నారు. చెంచాగిరికి అలవాటు పడ్డ మాల నాయకులు, రాజకీయ పార్టీలకు విశ్వాసంగా ఉన్నారే తప్ప, జాతి పట్ల విశ్వాసంగా లేరన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజికవర్గం పూర్తిగా ఉనికిని కోల్పోయామని, శాంతియుత పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కామ ప్రభాకర్ రావు, బల్లెం లక్ష్మణ్, మిరియాల బాలశౌరి, తోట దుర్గాప్రసాద్, కనికెళ్ళ నాని, నెల్లి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.


