స్మార్ట్ కిడ్జ్‌లో సంక్రాంతి సందడి
ముగ్గుల తోరణాలు.. బొమ్మల కొలువులు.. భోగి మంటల హుషారు
కాకతీయ, ఖమ్మం : స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు శనివారం అంబరాన్ని తాకాయి. భోగి–సంక్రాంతి–కనుమ వేడుకలతో పాఠశాల ప్రాంగణం ఉత్సవ వాతావరణంతో కళకళలాడింది. ఆవరణమంతా రంగురంగుల ముగ్గుల తోరణాలు, మామిడి ఆకుల అలంకరణలు కనువిందు చేశాయి. విద్యార్థులు భోగి మంటల వద్ద ఆనందంగా గడిపి, చిన్నారులకు భోగిపండ్ల వేడుకను సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. బొమ్మల కొలువు, హరిదాసులు, డు–డు బసవన్నల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చీరలు, పంచలతో సాంప్రదాయ దుస్తుల్లో విద్యార్థులు మెరిశారు. తెలుగింటి పిండి వంటలు, చెరుకు గడలు, గాలిపటాలతో సంక్రాంతి హుషారు వెల్లివిరిసింది. రైతన్న పంట ప్రక్రియల సన్నివేశాలు ఆకట్టుకోగా, జానపద గేయాలకు చిన్నారుల నృత్యాలు మంత్రముగ్ధం చేశాయి. మహిళలకు నిర్వహించిన ముగ్గుల పోటీల్లో సామాజిక అంశాలపై వేసిన రంగవల్లులు ఆలోచింపజేశాయి. ఈ సందర్భంగా కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ.. సంక్రాంతి సంబరాలు తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు నిదర్శనమన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ చింతనిప్పు సుకన్య, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


