సామినేని హంతకులను అరెస్టు చేయాలి
ఖమ్మం సీపీకి అఖిలపక్షం నేతల వినతి పత్రం
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : సీపీఐ (ఎం) రాష్ట్ర నాయకులు సామినేని రామారావు హంతకులను తక్షణమే అరెస్టు చేసి, చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అఖిలపక్షాల నేతలు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కు శుక్రవారం వినతి పత్రం సమర్పించారు. అక్టోబర్ 31వ తేదీ ఉదయం 5.30 గంటల ప్రాంతంలో చింతకాని మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన సీపీఐ (ఎం) నాయకులు సామినేని రామారావును ఆయన ఇంటి వద్దనే కొట్టంలో హత్య చేశారని తెలిపారు. అదే గ్రామానికి చెందిన బొర్రా ప్రసాద్, కంచుమర్తి రామకృష్ణ, మద్దినేని నాగేశ్వరరావు, కండ్రా పిచ్చయ్య, కొత్తపల్లి వెంకటేశ్వర్లుతో పాటు మరికొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి అతి దారుణంగా హత్య చేశారని రామారావు భార్య స్వరాజ్యం ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రామారావు ఉన్నంత కాలం గ్రామంలో సీపీఐ (ఎం) ను ఓడించటం సాధ్యం కాదని, రాజకీయ కక్షతో ఆ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కుట్ర పన్ని కిరాతకంగా హత్య చేశారని ఆరోపించారు. రామారావు హత్య జరిగి ఇప్పటికీ 21 రోజులు అవుతున్నా.. ఆయన సతీమణి స్వరాజ్యం హంతకులను స్వయంగా చూశానని చెబుతున్నా… వారి పేర్లతో సహా పిటిషన్ ఇచ్చినా ఇప్పటివరకు నిందితులను అరెస్టు చేయకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. రామారావు నిస్వార్ధ ప్రజానాయకులు, పాతర్లపాడు గ్రామానికి రెండుసార్లూ ఏకగ్రీవ సర్పంచ్ గా పని చేశారని వివరించారు. ఆయన సతీమణి సైతం ఒకసారి సర్పంచ్ గా పనిచేసిన విషయాన్ని గుర్తు చేశారు. పేదలకు సొంత భూములు పంచిన చరిత్ర వారికి ఉందన్నారు. రైతు సంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా.. సుమారు 50 ఏళ్లపాటు సీపీఐ (ఎం) నాయకునిగా ఆయన కొనసాగిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం తన స్వగ్రామంలో ఉంటూ గ్రామాభివృద్ధికి పాటుపడుతున్న రామారావును అన్యాయంగా హతమార్చారని తెలిపారు. హంతకులతో పాటు హత్యకు కుట్ర దాల్చిన వారిని అరెస్టు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సీపీని కలిసి వినతి పత్రం సమర్పించిన అఖిలపక్ష నేతల్లో సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, బీఆర్ ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్ రెడ్డి, సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ జిల్లా నాయకులు ఆవుల అశోక్, న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి కోలా లక్ష్మీనారాయణ, సీపీఐ (ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మాచర్ల భారతి, బండి రమేష్, వై. విక్రం తదితరులు ఉన్నారు.


