సింగరేణి కార్మికులకు రూ.400 కోట్ల బోనస్
18న బీసీ బంద్ లో యావత్ ప్రజానీకం పాల్గొనాలి
ప్రధాని మోడీ, రాష్ట్రపతి వద్ద బీసీ బిల్లు కోసం బీజేపీ నాయకులు సమయం తీసుకోండి
సీఎం నాయకత్వంలో అఖిలపక్షం ఢిల్లీకి వచ్చేందుకు సిద్ధం
సుప్రీంకోర్టు తీర్పు కాపీ వచ్చాక చర్చించి 23న క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటాం
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: దేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ ప్రకటన పట్ల రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంతోషం వ్యక్తం చేస్తున్నానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ అజ్ఞానం నుంచి విజ్ఞానం వైపు పయనిస్తూ చెడుపై మంచి విజయం సాధించాలని కోరుకుంటూ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలతో వెలుగులు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఓబీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడానికి కట్టుబడి ఉందని, దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆర్థిక, సామాజిక, విద్య, రాజకీయ సర్వే నిర్వహించామని చెప్పారు. సర్వే వివరాలతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదింపజేసి గవర్నర్ కు పంపామని తెలిపారు. బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు సంబంధించి రెండు బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదింపజేసి గవర్నర్ కు పంపామని డిప్యూటీ సీఎం తెలిపారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కొన్ని నెలలుగా బీసీ చట్టం అమల్లోకి రాకుండా అడ్డుకుంటుందని ఆరోపించారు. రాష్ట్రం నుంచి అఖిలపక్షంగా వచ్చి రాష్ట్రపతి, ప్రధానమంత్రిని కలుస్తామని పదేపదే లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేసినా కేంద్ర నుంచి అనుమతి ఇవ్వలేదని డిప్యూటీ సీఎం వివరించారు. హైకోర్టు, సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల కేసును గెలిచేందుకు దేశంలో అనుభవజ్ఞులైన అభిషేక్ మను సింగ్వి, రవి వర్మ వంటి న్యాయ కోవిదులను కాంగ్రెస్ ప్రభుత్వం నియమించి కొట్లాడిన సంగతి దేశ ప్రజలందరికీ తెలుసనన్నారు. ఈనెల 18న రాష్ట్రంలో బిజెపికి వ్యతిరేకంగా జరుగుతున్న బీసీ బంద్ నిరసన కార్యక్రమంలో అందరూ పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు రామచంద్ర రావులు ప్రధాని మోడీ, రాష్ట్రపతి వద్ద బీసీ బిల్లు ఆమోదం కోసం సమయం తీసుకోండి, నాయకత్వం వహించండని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్రం నుంచి అఖిలపక్ష పార్టీలు బిజెపి నాయకత్వంలో ఢిల్లీకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, మేము అడిగితే కేంద్ర పెద్దలు సమయం ఇవ్వడం లేదని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పై కాంగ్రెస్ ప్రభుత్వానికి, పార్టీ చిత్తశుద్ధితో ఉందన్నారు. సుప్రీం తీర్పు కాపీ రాగానే బీసీల రిజర్వేషన్ అంశంపై చర్చించి ఈనెల 23న జరిగే క్యాబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుంమని మంత్రి తెలిపారు.


