మహబూబాబాద్‌లో రౌడీషీటర్ల బైండోవర్!
మున్సిపల్ ఎన్నికల వేళ 20 మందిపై పోలీసుల చర్య
భయంలేని పోలింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
కాకతీయ,మహబూబాబాద్:మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మహబూబాబాద్ టౌన్ పరిధిలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రజలు భయం లేకుండా, స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు టౌన్ ఇన్‌స్పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి తెలిపారు. జిల్లా ఎస్పీ డా. శబరిష్.పి ఆదేశాల మేరకు, టౌన్ డీఎస్పీ తిరుపతిరావు సూచనలతో టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం 20 మంది రౌడీషీటర్లను మహబూబాబాద్ ఎమ్మార్వో సమక్షంలో బైండోవర్ చేశారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా ఉండాలనే షరతులతో ఎమ్మార్వో వారి వద్ద నుంచి షూరిటీ తీసుకుని, సెల్ఫ్ షూరిటీపై వారిని విడుదల చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో పట్టణంలో సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు టౌన్ ఇన్‌స్పెక్టర్ వెల్లడించారు. రౌడీషీటర్లు, అనుమానిత వ్యక్తుల కదలికలపై నిఘా కొనసాగుతుందని, చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలింగ్ రోజు వరకు పోలీసు పికెటింగ్, గస్తీ మరింత పెంచనున్నట్లు తెలిపారు. ప్రజలు ఎలాంటి పుకార్లను నమ్మకుండా, శాంతియుత వాతావరణాన్ని కాపాడాలని కోరారు. ఎక్కడైనా అనుమానాస్పద ఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా సాగేందుకు అన్ని శాఖలతో సమన్వయంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఎస్‌ఐలు చ. అరుణ్ కుమార్, టి. ప్రశాంత్ బాబు, ఎస్‌కే. షాకీర్, బి. మౌనిక, ఎం.డి. అలీం హుస్సేన్, యు. సూరయ్యతో పాటు బ్లూ కోల్ట్స్ సిబ్బంది పాల్గొన్నారు.


