రెవెన్యూ అధికారి చేతివాటం
ఇంటి నెంబర్ల కేటాయింపునకు లక్షల్లో వసూళ్లు
ఒకటే ఇంటి నెంబర్ పై రెండు మద్యం దుకాణాల నిర్మాణాలు
ఖమ్మం కార్పొరేషన్‌లో అధికారి లీలలు
సీఎంవో కార్యాలయ పైరవీ అంటూ కింది స్థాయి సిబ్బందిపై ఒత్తిడి
ఎన్ని సార్లు చర్యలు తీసుకున్న మారని ఆయన తీరు
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం కార్పొరేషన్ లో రెవెన్యూ అధికారి చేతివాటం చూపిస్తూ అందని కాడికి దండుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో కేటాయించిన మద్యం దుకాణాల ఇంటి నెంబర్ల కోసం ఈ చర్యలకు పాల్పడ్డట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఖమ్మం పట్టణంలోని శ్రీ శ్రీ సర్కిల్ లో నిర్మాణం జరుగుతున్న లిక్కర్ మార్ట్ ఇంటి నెంబర్ మద్యం దుకాణం ఇంటి నెంబర్ ఒక్కటేనని తెలుస్తోంది. ఈ విషయంపై రెవెన్యూ అధికారి అంతా నేను చూసుకుంటా ఆ యజమానికి హామీ ఇచ్చినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదేవిధంగా బల్లేపల్లి లో కొత్తగా నిర్మాణం అవుతున్న మద్యం దుకాణం విస్తీర్ణం సుమారు 3000 గజాల్లో నిర్మాణం జరుగుతున్నట్లు తెలుస్తోంది.

సీఎంవో కార్యాలయ పైరవీ అంటూ అధికారి లీలలు..
ఆ మద్యం దుకాణ యజమాని కి ఇచ్చిన మాట ప్రకారం ఇంటి నెంబర్ కేటాయింపు జరపడం కోసం కిందిస్థాయి సిబ్బంది పై ఈ ఫైలు సి ఎం ఓ కార్యాలయం రికమండేషన్ మీద వచ్చిందంటూ వారిపై ఒత్తిడి పెంచి కేటాయింపు జరిపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరో లిక్కర్ మార్ట్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఏర్పాటు చేసుకునేందుకు ఆ యజమాని కి ఇంటి నెంబర్ కోసం మాట ఇచ్చినట్లు వార్తలు వినపడుతున్నాయి. ఈ యజమాని దీని కన్నా ముందు జమ్మి బండ పక్కన ఏర్పాటు చేసుకోవడానికి అభ్యంతరాలు రావడంతో దానిని షిఫ్టింగ్ పేరుతో ఇల్లందు క్రాస్ రోడ్ కి మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ కూడా వివాదంలో ఉన్న భవనం కావడం ఆ భవనానికి ఇంటి నెంబరు ఇస్తాను అనడం ఆ రెవెన్యూ అధికారి పని తీరుకు నిదర్శనమని చెప్పవచ్చు. ఈ మూడు మద్యం దుకాణాలకు గాను ఇప్పటికే సుమారు లక్షన్నరపైగా వసూలు చేసినట్లు ఆరోపణలు వినబడుతున్నాయి. కొన్నేళ్లుగా ఖమ్మం కార్పొరేషన్లో పనిచేసిన ఈ అధికారి వివిధ ఆరోపణల నేపథ్యంలో కార్యాలయానికి దూరమైనప్పటికీ మరల ఉద్యోగ సంఘాల అండదండలతో ఖమ్మం కార్పొరేషన్ లో కి వచ్చి అదే తీరును కొనసాగించడం గమనార్హం.


