రేవంత్ భాష మార్చుకో..
ప్రజలను భయపెడితే చూస్తూ ఉరుకోం..
మాగంటితోనే జూబ్లీహిల్స్ అభివృద్ధి..
సీఎంకు ధైర్యం ఉంటే ఒపీనియన్ పోల్‌కు సిద్ధంకావాలి
బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్‌లో రూ. 44 వేల కోట్లు ఖర్చుచేశాం
నగరంలో ఒక్క ఇందిరమ్మ ఇళ్ళు అయినా కట్టారా?
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి తలసాని ఫైర్
కాకతీయ, తెలంగాణ బ్యూరో : రేవంత్ రెడ్డి అలవాట్లు అందరికి ఉండవని, ప్రజలను భయపెడితే చూస్తూ ఊరుకోమని బీఆర్ఎస్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. తెలంగాణ భవన్‌లో పలువురు బీఆర్ఎస్ నాయకులతో ఆయన ప్రెస్‌మీట్ నిర్వహించి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయకపోతే పధకాలు ఆగుతాయని అన్నారని.. ప్రజలను రేవంత్ రెడ్డి భయపెడుతున్నారా? అని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలు ఆగితే పోరాటం ఎలా చేయాలో తమకు తెలుసు అని చెప్పారు. అసెంబ్లీని ఏ విధంగా స్తంభింపచేయాలో కూడా తెలుసు అని అన్నారు. అసెంబ్లీలో మాట్లాడకుండా పనిచేసే ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారని అన్నారు. మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని చెప్పారు. ఆయన చివరి వరకు ప్రజల్లో ఉన్నారని గుర్తుచేశారు.
హామీలు ఏమయ్యాయి?
రేవంత్ రెడ్డి ఇప్పటికైనా భాష మార్చుకోవాలని తలసాని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ధైర్యం ఉంటే ఒపీనియన్ పోల్‌కు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. 23 నెలల్లో రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరంలో ఎక్కడ తిరిగారో చెప్పాలన్నారు. బీఆర్ఎస్ హయాంలో రూ. 44 వేల కోట్లు హైదరాబాద్ నగరంలో ఖర్చు పెట్టామని.. కాంగ్రెస్ కేవలం రూ. 4,600 కోట్లు మాత్రమే ఉమ్మడి రాష్ట్రంలో ఖర్చు పెట్టిందని చెప్పారు. హైదరాబాద్ నగరంలో ఒక్క ఇందిరమ్మ ఇళ్ళు అయినా కట్టారా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో ఉన్నారా? లేక వేరే దేశంలో ఉన్నారా? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆడబిడ్డలకు తులం బంగారం, వృద్ధులకు, మహిళలకు పింఛన్లు ఇస్తామన్న రేవంత్ రెడ్డిని ఎక్కడ కట్టేయాలని ఫైర్ అయ్యారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత 4 వేల కోట్ల రూపాయల అభివృద్ధి జరిగిందని నిరూపిస్తే రాజీనామాకు తాను సిద్ధంగా ఉన్నట్లు సవాల్ విసిరారు.
బీఆర్ఎస్ డిమాండ్‌తోనే అజారుద్దీన్‌కు మంత్రి పదవి
బీఆర్ఎస్ డిమాండ్‌తోనే అజారుద్దీన్‌కు మంత్రి పదవి వచ్చిందని తలసాని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లింలకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. 23 నెలల్లో రేవంత్ రెడ్డి పాలనపై చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఎన్టీఆర్‌కు మాగంటి గోపీనాధ్ వీరాభిమాని అని.. ఎన్టీఆర్‌తో కలిసి మాగంటి గోపీనాధ్ తిరిగారని గుర్తు చేశారు. కమ్మ సామాజికవర్గం ఓట్ల కోసం ఎన్టీఆర్ విగ్రహం గురించి మాట్లాడారని చెప్పారు.
ప్రభుత్వాన్ని సర్కస్ కంపెనీలా నడిపిస్తున్నారు
సన్నబియ్యం, రేషన్ కార్డులు తప్ప సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడటం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో రేషన్ కార్డులు ఇవ్వలేదని నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్ధంగా ఉన్నానాని చెప్పారు. అన్నపూర్ణ అంటే కేసీఆర్ కుటుంబం పేరు కాదు కదా.. అన్నపూర్ణ క్యాంటీన్ల పేరును ఇందిరమ్మ క్యాంటీన్లుగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి రెండవ రాజధాని నగరం స్థాయిలో హైదరాబాద్ అభివృద్ధి చెందిందని చెప్పారు. ప్రభుత్వాన్ని సర్కస్ కంపెనీలా నడిపిస్తున్నారని ఫైర్ అయ్యారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో రూ. 4 వేల కోట్ల అభివృద్ధి ఎక్కడ జరిగిందో సీఎం చూపించాలని తలసాని డిమాండ్ చేశారు.


