ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరానికి స్పందన
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని అనుబోస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కాకతీయ కమ్యూనిటీ ఫౌండేషన్, కొల్లి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. బసవతారక ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, హైదరాబాద్ వారి సహకారంతో డిసెంబర్ 23, 24 తేదీల్లో ఈ శిబిరం నిర్వహించారు. పాల్వంచ పరిసర ప్రాంతాలతో పాటు జిల్లాలోని 8 మండలాల నుంచి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కుక్కునూరు మండలం నుంచి సుమారు 30 మంది పాల్గొన్నారు. మొత్తం 620 మంది పరీక్షలు చేయించుకోగా, ఇందులో 350 మంది మహిళలు, 270 మంది పురుషులు ఉన్నారు. వీరిలో 41 మందిని క్యాన్సర్ అనుమానిత కేసులుగా గుర్తించి, తదుపరి చికిత్స కోసం హైదరాబాద్ బసవతారక ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్‌కు రిఫర్ చేశారు. శిబిరంలో మామోగ్రఫీ, అల్ట్రాసౌండ్, డిజిటల్ ఎక్స్‌రే, గర్భాశయ ముఖ క్యాన్సర్ పరీక్షలు తదితర వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో కాకతీయ కమ్యూనిటీ ఫౌండర్ గూడూరి సత్యనారాయణ, కొల్లి ఫౌండేషన్ చైర్మన్ కొల్లి కల్పనా చౌదరి, అనుబోస్ కాలేజ్ చైర్మన్ తలసిల భరత్ కృష్ణ, బసవతారక ఆస్పత్రి వైద్యులు రేణుక, ప్రవళిక, మన్విత, సిమ్రాన్, అబ్దుల్, ఏజీఎం లక్ష్మణ్, కొల్లి ఫౌండేషన్ జిల్లా కోఆర్డినేటర్ రూప్లా నాయక్ తదితరులు పాల్గొన్నారు.


