కేసీఆర్ హయాంలోనే పోరాటయోధులకు గౌరవం
ప్రభుత్వ నిర్లక్ష్యం.. ఐలమ్మకు అవమానం
ఐలమ్మ జయంతిన మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొనకపోవడంపై సరికాదు
బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : పోరాడి సాధించుకున్న తెలంగాణలో పోరాట యోధులు, ప్రాణ త్యాగం చేసిన వీరులకు కాంగ్రెస్ పాలనలో అవమానం జరిగిందని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు అన్నారు. సాయుధ రైతాంగ పోరాట వీరనారి చిట్యాల చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా శుక్రవారం ఖమ్మం నగరంలో ఆమె విగ్రహం వద్ద నివాళులర్పించేందుకు వెళ్లిన బీఆర్‌ఎస్ నాయకులను అధికారులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.
“కలెక్టర్ వచ్చాకే మీరు దండలు వేయాలి” అంటూ అధికారుల నిరంకుశ వైఖరిపై నగర బీఆర్‌ఎస్ నాయకులు మండిపడ్డారు. కలెక్టర్ కార్యక్రమం ఉదయం 9.30 గంటలకు నిర్ణయించి 11 గంటలైనా రాకపోగా, తమను అడ్డుకోవడం బలహీన వర్గాల ఆత్మగౌరవానికి భంగమని విమర్శించారు. బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో నాగరాజు, నేతలు బిచ్చాల తిరుమలరావు, మేకల సుగుణరావు, షకినా మాట్లాడారు. తెలంగాణ సాధించిన తర్వాత బలహీన వర్గాల పోరాటయోధుల జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని గుర్తు చేశారు. కేసీఆర్ నాయకత్వంలోనే ఐలమ్మ, సర్దార్ సర్వాయి పాపన్న ల విగ్రహాలను ఏర్పాటుచేశారన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం యోధుల విగ్రహాలకు గౌరవం ఇవ్వకపోవడం వివక్షతకే నిదర్శనమని మండిపడ్డారు. గతంలో పువ్వాడ అజయ్‌కుమార్ సహకారంతో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటైందని, కానీ నేడు ఆ విగ్రహానికి కూడా పూలదండలు వేసే అవకాశం లేకపోవడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కర్నాటి కృష్ణ, మక్బూల్, భోజట్ల రామ్మోహన్, వీరభద్రం, ఉస్మాన్, కందాల వీరేందర్, నెమలి కిషోర్, ఆసిఫ్, పొలే పొంగు వెంకట్, అఫ్రోజ్, మాధవి, పిట్టల తిరుమల్, ఎడ్లపల్లి నవీన్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.


