బ్యాంక్ కస్టమర్లకు ఊరట?
అన్ని బ్యాంకులకు ఒకే ఛార్జీలు, నిబంధనలు!
ఆర్బీఐ కసరత్తు షురూ
కాకతీయ, బిజినెస్ : బ్యాంకింగ్ సేవలు వినియోగించుకునే కస్టమర్లకు త్వరలో శుభవార్త లభించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం బ్యాంకును బట్టి వేర్వేరుగా ఉన్న కనీస బ్యాలెన్స్ నిబంధనలు, ఏటీఎం వార్షిక ఫీజులు, ఇతర సేవా రుసుములను దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు ఒకే విధంగా (ప్రామాణికంగా) అమలు చేసే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కసరత్తు మొదలుపెట్టింది. ఈ మేరకు దేశంలోని అన్ని వాణిజ్య బ్యాంకులతో ఆర్బీఐ ఇప్పటికే చర్చలు జరుపుతోంది.
అదనపు భారం తగ్గించేందుకే..!
ప్రస్తుతం ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులలో కనీస బ్యాలెన్స్ (Minimum Balance) నిర్వహణ నిబంధనలు భిన్నంగా ఉన్నాయి. కొన్ని బ్యాంకుల్లో ఇది రూ.10 వేలుగా ఉండగా, మరికొన్నింటిలో రూ.15 వేలుగా ఉంది. అలాగే, ఏటీఎం వార్షిక ఛార్జీలు కూడా బ్యాంకును బట్టి మారుతున్నాయి. ఈ భిన్నమైన నిబంధనల కారణంగా కస్టమర్లు తరచూ అదనపు ఆర్థిక భారం మోయాల్సి వస్తోంది. ఈ సమస్యకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే ‘ప్రామాణిక సేవా రుసుము విధానం’ (Standardised Service Charges) తీసుకురావాలని ఆర్బీఐ భావిస్తోంది.
పారదర్శకంగా ప్రాసెసింగ్ ఫీజులు..
బ్యాంకింగ్ వర్గాల సమాచారం ప్రకారం, వివిధ సేవలపై వసూలు చేస్తున్న ఛార్జీలను సరళీకృతం చేయడమే ఈ ప్రతిపాదనల ముఖ్య లక్ష్యం. ముఖ్యంగా, రుణాలకు (Loans) సంబంధించి దరఖాస్తు చేసినప్పటి నుంచి మంజూరు లేదా తిరస్కరణ వరకు వసూలు చేసే ప్రాసెసింగ్ ఫీజులను పూర్తిగా పారదర్శకంగా, ముందే తెలియజేసేలా నిబంధనలు రూపొందించనున్నారు. దీంతో కస్టమర్లకు ఎలాంటి అయోమయం ఉండదని ఆర్బీఐ భావిస్తోంది. అదేవిధంగా, కనీస బ్యాలెన్స్ నిర్వహించనందుకు విధిస్తున్న జరిమానాలపై కూడా ఆర్బీఐ పునఃపరిశీలన జరపనుంది. ఇప్పటికే అనేక ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ జరిమానాలను ఉపసంహరించుకున్నాయి. ఆర్బీఐ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే, దేశవ్యాప్తంగా బ్యాంకు సేవలు మరింత సులభంగా, కస్టమర్‌కు అనుకూలంగా మారతాయని బ్యాంకింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.


