లేఔట్ అనుమతుల్లో నిబంధనలు తప్పనిసరి
అప్రోచ్ రోడ్డు లేకుంటే లేఔట్‌కు అనుమతి లేదు
ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అనుమతులు నిషేధం
పారదర్శకంగా దరఖాస్తుల పరిశీలన
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్పష్టీకరణ
జిల్లా స్థాయి లేఔట్ కమిటీ సమావేశం
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : లేఔట్ అనుమతుల జారీలో ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను కట్టుదిట్టంగా పాటించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్పష్టం చేశారు. ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిబంధనల మేరకే అనుమతులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి లేఔట్ కమిటీ సమావేశంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. పెండింగ్‌లో ఉన్న లేఔట్ దరఖాస్తులపై సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్, ఇతర లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో కలెక్టర్ సుదీర్ఘంగా చర్చించారు. ప్రతి దరఖాస్తుకు సంబంధించిన అభ్యంతరాలు, శాఖల రిమార్క్స్‌ను అడిగి తెలుసుకుని పలు కీలక సూచనలు చేశారు. అనుమతుల ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ సమావేశంలో 12 డ్రాఫ్ట్ లేఔట్లు, 4 ఫైనల్ లేఔట్లను కమిటీ పరిశీలించిందని తెలిపారు. లేఔట్లకు అనుమతులు ఇచ్చే సమయంలో నీటి వనరులు, చెరువులు, వాగుల ఎఫ్టీఎల్ పరిధిలోకి రాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అనుమతులు వద్దు
లేఔట్ ప్రాంతాలు ఎట్టి పరిస్థితుల్లోనూ వాటర్ బాడీల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉండకూడదని కలెక్టర్ స్పష్టంగా పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం పూర్తిగా నిషేధమని తెలిపారు. నీటి ప్రవాహ మార్గాలు, సహజ జల వనరులకు ఆటంకం కలిగేలా ఎలాంటి అనుమతులు జారీ చేయరాదన్నారు. లేఔట్లో అప్రోచ్ రోడ్డు తప్పనిసరిగా 18 మీటర్ల వెడల్పుతో ఉండాలని స్పష్టం చేశారు. రోడ్డు నిర్మాణానికి అవసరమైన మేర భూమి కేటాయింపులు లేఔట్ ప్లాన్‌లో స్పష్టంగా చూపించాలన్నారు. ఈ అంశాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అనుమతులు మంజూరు చేయాలని ఆదేశించారు.
సర్వే నివేదికలు తప్పనిసరి
ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, మండల సర్వేయర్లు, ఆర్డీవోలు సంయుక్తంగా లేఔట్ దరఖాస్తులను పరిశీలించి పూర్తి స్థాయి నివేదిక అందించాలని కలెక్టర్ సూచించారు. చుట్టుపక్కల సర్వే నంబర్లు, భూమి స్వరూపం, గతంలో అక్కడ నీటి వనరులు ఉన్నాయా లేదా అనే అంశాలను సాంకేతిక పద్ధతుల్లో పరిశీలించాలని ఆదేశించారు. లేఔట్ ప్రాంతాల్లో గతంలో చెరువులు, వాగులు లేదా నీటి నిల్వ ప్రాంతాలు ఉన్నాయా అనే విషయాన్ని ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి నిర్ధారించాలని చెప్పారు. ఎలాంటి అనుమానాలు ఉన్నా పూర్తి స్థాయిలో ధృవీకరణ చేసిన తర్వాతే అనుమతులు మంజూరు చేయాలని స్పష్టం చేశారు. లేఔట్ అనుమతుల జారీ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలని, నిబంధనలకు లోబడి మాత్రమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. అనుమతి ఇచ్చిన తర్వాత కూడా అభివృద్ధి సమయంలో నిబంధనలు పాటిస్తున్నారా లేదా అన్నదానిపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని పట్టణాభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలన్నారు. అక్రమ లేఔట్లు, నిబంధనలకు విరుద్ధమైన నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించరాదని స్పష్టం చేశారు. అధికారులు సమన్వయంతో పని చేస్తూ నాణ్యమైన పట్టణాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్డీసీ ఎం. రాజేశ్వరి, ఆర్అండ్బీ ఎస్ఈ యాకోబు, పీఆర్ ఎస్ఈ వెంకట్ రెడ్డి, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ శ్రీనివాసాచారి, జిల్లా టౌన్ ప్లానింగ్ అధికారి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ రాజేందర్, ఏదులాపురం టౌన్ ప్లానింగ్ అధికారి, ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస రెడ్డి, డీఈ రాజేష్, తహసీల్దార్లు రాంప్రసాద్, సైదులు, శ్వేత, అరుణ తదితర అధికారులు పాల్గొన్నారు.


