కాకతీయ, నేషనల్ డెస్క్: ప్రధాని నరేంద్రమోదీకి చైనాలో ఘనస్వాగతం లభించింది. షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ తియాంజిన్ కు చేరుకున్నారు. 2020లో లడఖ్ సరిహద్దులో భారత్ చైనా సైనికుల మధ్య ఘర్షణల తర్వాత ప్రధాని మోదీ ఆ దేశాన్ని సందర్శించడం ఇదే తొలిసారి. చైనాలో చివరిగా 2018లో పర్యటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలతో భారత్ విరుచుకుపడిన తరుణంలో మోదీ చైనా పర్యటన మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
జపాన్ లో రెండు రోజుల పర్యటన తర్వాత ప్రధాని మోదీ చైనాకు చేరుకున్నారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తేదీ్లో తియాంజిన్ వేదికగా నిర్వహించనున్న ఎస్ సీవో సదస్సులో మోదీ పాల్గొంటారు. ఈక్రమంలో చైనా అధ్యక్షుడు జెన్ పింగ్, రష్యా అధినేత పుతిన్ సహాఆయా దేశాధినేతలతో సమావేశం కానున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం తీసుకువచ్చేందుకు భారత్ చైనాతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే.
భారత ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా తమ జపాన్ పర్యటన కొనసాగిందని ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ పర్యటన సందర్భంగా భారత్, జపాన్ ల మధ్య దాదాపు 13 ఒప్పందాలు ఖరారైనట్లు తెలుస్తోంది. భారత్ లో వచ్చే దశాబ్దకాలంలో రూ. 6లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ సుముఖత వ్యక్తం చేసింది. సెమీకండక్టర్లు, క్లీన్ ఎనర్జీ, టెలికాం సహాకీలకమైన ఖనిజాలు అభివ్రుద్ధి చెందుతున్న సాంకేతికతలు వంటి వ్యూహాత్మక రంగాల్లో సహాకారం పెంచుకునేందుకు ఇరు దేశాలు కూడా అంగీకరించాయి.


