దూరం దగ్గరైంది!
దొంతికి రేవంత్‌కు మధ్య సయోధ్య
నర్సంపేట ఎమ్మెల్యేకు పార్టీలో, ప్రభుత్వంలో పెద్దపీట
వరంగల్ జిల్లా రాజకీయంపై సీఎం ఫోకస్
డీసీసీ అధ్యక్షుడి నియామకానికి దొంతి ప్రతిపాదనలు
సీఎం సానుకూల స్పందన.. వర్ధన్నపేట నేత పేరు ప్రస్తావన!!
కొండా సురేఖ తనయ సుస్మిత వ్యాఖ్యల తర్వాత ఆసక్తికర పరిణామం
కూల్‌గా మొదలైన రాజకీయ వేఢీ
కాకతీయ, నర్సంపేట/ వరంగల్ ప్రతినిధి : కాంగ్రెస్‌లో మాస్ లీడర్‌గా పేరొందిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డినిపార్టీలో, ప్రభుత్వంలో క్రియాశీలకంగా మార్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దొంతి మాధవరెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో అంటీ ముట్టనట్లుగా ఉంటూ వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల దొంతి మాధవరెడ్డి మాతృమూర్తి కాంతమ్మ దశ దిన కర్మ రోజున సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమానికి హాజరు కావడం.. ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డిల మధ్య మనస్పర్ధలు తొలగిపోయినట్లయింది. శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి చాంబర్‌లో ఉన్న దొంతి మాధవరెడ్డి ఫొటోలు ఇందుకు బలాన్ని చేకూర్చినట్లయింది. దొంతి మాధవరెడ్డి సీఎంతో ఉన్న ఫొటోలపై ఇప్పుడు విశ్లేషణలు జరుగుతున్నాయి.

కొండా సురేఖ ఎపిసోడ్ తర్వాత..ఆసక్తికర పరిణామం..!
డెక్కన్ సిమెంట్స్ కంపెనీ ప్రతినిధులపై బెదిరింపులకు పాల్పడినట్లుగా మంత్రి కొండా సురేఖ ఓఎస్డీగా పనిచేసిన సుమంత్‌పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌గా తీసుకుని సుమంత్‌ను విధుల నుంచి తప్పించేందుకు ఆదేశాలిచ్చారు. ఆ తర్వాత సుమంత్‌ను అరెస్టు చేసేందుకు మినిస్టర్ క్వార్టర్స్‌లోని మంత్రి కొండా సురేఖ ఇంటికి టాస్క్‌ఫోర్స్ పోలీసులు వెళ్లడంతో రాజకీయ వేడి రగులుకుంది. ప్రభుత్వ పెద్దల తీరును తప్పుబడుతూ మంత్రి తనయ సుస్మిత పటేల్ తీవ్రంగా ఆక్షేపించారు. ఈక్రమంలోనే రెడ్డి సామాజిక వర్గం నేతలు తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆయన తమ్ముళ్లపైనా తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం ముఖ్య సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి వంటి నేతలు తమపై కుట్రలు చేస్తున్నారంటూ తీవ్రస్థాయి ఆరోపణలు చేశారు.ఈ పరిణామం తర్వాత సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తారనే చర్చ జోరుగా సాగింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, ఏఐసీసీ నేత మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చొరవతో పరిస్థితి సర్దుబాటైనట్లుగా తెలుస్తోంది.

టీ కప్పులో తుఫానే.. కానీ.. కూల్‌గా ఆపరేషన్ మొదలుపెట్టారా..?
కొండా సురేఖ తనయ సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆయన కుటుంబ సభ్యులపై చేసిన తీవ్ర ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్నట్లుగా చర్చ జరుగుతోంది. అధిష్ఠానం ఆదేశాలు.. సుస్మిత చేసిన ఆరోపణల అంశంపై సీరియస్‌గా స్పందిస్తే.. ప్రతిపక్షాలకు ఆయుధాలు అందించినట్లమవుతోందనే యోచనతోనే సీఎం కాస్త వెనక్కి తగ్గినట్లుగా పార్టీ ముఖ్య నేతల మధ్య చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా…ఇటీవల జరిగిన కేబినేట్ మీటింగ్ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై తన కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలకు తాను స్వయంగా క్షమాపణ కోరుతున్నట్లుగా చెప్పారు. ఇక ఈ విషయం ఇంతటితో ముగిసిపోయిందన్నట్లుగా..టీ కప్పులో తుఫాను అన్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలను నిజమేనన్నట్లుగా కాంగ్రెస్ అధిష్ఠానం సెండాఫ్ ఇచ్చేసింది. ప్రస్తుతానికి ఈ వ్యవహారం పైకి చల్లబడినట్లుగా కనిపించినా..లోలోన మాత్రం రగులుతూనే ఉన్నట్లుగా నేతల వైఖరి స్పష్టం చేస్తోంది. రాజకీయాల్లో అదును చూసి..చర్యలు తీసుకోవడం.. వేటు వేయడం.. దెబ్బకొట్టడం.. ఒంటరిని చేయడం వైఖరిలుంటాయని సీనియర్ నేతలు గుర్తు చేస్తున్నారు. ఈ విషయంలో కొండా దంపతులపై కూల్‌గా ఆపరేషన్ మొదలుపెట్టారనే చర్చ కూడా కాసింత గట్టిగానే నడుస్తుండటం గమనార్హం.
వరంగల్ డీసీసీతోనే మొదలా..! దొంతికి సీఎం మర్యాద..!
ఉమ్మడి వరంగల్ డీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉన్న నేతగా, వరంగల్ రాజకీయాల్లో ప్రత్యేక శైలిని, అనుచరగణాన్ని కలిగిన మాస్ లీడర్‌గా ఉన్న దొంతి మాధవరెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలోని విబేధాలను పక్కన పెట్టి భవిష్యత్ కార్యాచరణలో భాగంగా దొంతిని కాంగ్రెస్ పార్టీలో ఆక్టివ్ చేయాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ బాధ్యతల్లో ఆయన అనుచర వర్గానికి ప్రాధాన్యం ఇచ్చేలా పావులు కదుపుతున్నట్లుగా కూడా చర్చ జరుగుతోంది. వర్ధన్నపేట మండలానికి చెందిన ఓ నేతకు డీసీసీ పదవి ఇవ్వాలని దొంతి కోరినట్లుగా, దానికి సీఎం సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు డీసీసీ అధ్యక్ష పదవి కోసం కొండా అనుచరులతో పాటు మరికొంతమంది సీనియర్లు కూడా ఆశిస్తున్నారు. ఈనేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి-దొంతిల మధ్య కుదిరిన రాజకీయం..ఎలాంటి నిర్ణయాలకు దారితీస్తుందో వేచి చూడాలి.


