పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి రెబల్స్ బెడద
అధికార పార్టీకి అధికార పార్టీతోనే పోరు!
నేతృత్వ లోపమేనా? వర్గపోరేనా?
ప్రజల్లో చర్చనీయాంశంగా మారిన కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి ఆచార, ప్రమాణాలకు విరుద్ధంగా రాజకీయ వాతావరణాన్ని మార్చివేశాయి. అధికార కాంగ్రెస్ పార్టీలోనే తిరుగుబాటుదారులు రెక్కలువిప్పడంతో, ‘కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీతోనే పోటీ’ అనే వ్యాఖ్యలు ప్రజల్లో వినిపిస్తూ రాజకీయంగా ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి.
పార్టీ నేతృత్వం బలహీనత కారణంగానే ఈ పరిస్థితి ఉద్భవించిందని కొంతమంది విశ్లేషించగా, మరికొందరు కాంగ్రెస్‌లో నెలకొన్న వర్గపోరు, లోతైన విభేదాలు ఈ స్థాయికి చేరేశాయని అంటున్నారు.
జిల్లాలో మొత్తం మీద ఇదే పరిస్థితి నెలకొనడం గమనార్హం. ముగ్గురు కీలక మంత్రులు ఉన్నా కూడా పార్టీ అంతర్గత విభేదాలను కట్టడి చేయలేకపోవడం ప్రజల వ్యతిరేకత కు పార్టీ గురవుతోందని సొంతపార్టీ వారే చర్చించకున్నారు. “ముగ్గురు మంత్రులు ఉన్నా ఇదే పరిస్థితి అయితే… నాయకత్వం ఎక్కడ?” అంటూ ఓటర్లు ప్రశ్నిస్తున్నారు.
సత్తుపల్లి నియోజకవర్గంలో పరిస్థితి మరింత రసవత్తరంగా మారిందనే చెప్పాలి. స్థానిక అధికార పార్టీ ప్రధాన నాయకుడి ఆధ్వర్యంలో ఎన్నికల వ్యూహాలు నడుస్తున్నప్పటికీ, అదే ప్రాంతానికి చెందిన మరో కీలక రాష్ట్ర నాయకుడు తన అనుచరులను రెబల్స్‌గా రంగంలోకి దించడంతో పోటీ తీవ్ర ప్రతిష్ఠాత్మకంగా మారిపోయింది. ఇద్దరు పెద్ద నాయకుల ప్రభావం ఒకే నియోజకవర్గంలో తాకడంతో, గ్రామీణ స్థాయి రాజకీయాల్లో పెను మార్పు చోటుచేసుకుంటోందనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత శాంతి నెలకొనే అవకాశాలేమీ కనిపించకపోగా, పంచాయతీ ఎన్నికల ఫలితాలు పార్టీలో భవిష్యత్ శక్తి సమీకరణాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇక బీ ఆర్ ఎస్ మాత్రం కొన్ని చోట్ల అధికార కాంగ్రెస్ కి సపోర్ట్ చెయ్యగా మరి కొంతమంది బీ ఆర్ ఎస్ నాయకులు రెబల్ అభ్యర్ధులకు సపోర్ట్ చేయడం వింతగా ఉందని ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు.


