రేషన్ డీలర్ బెదిరింపులు!
కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల తర్వాత కొత్తగూడెంలో ఉద్రిక్తత
ఓటమి చెందిన అభ్యర్థి బంధువుల బూతు పురాణం
“రేషన్ ఎలా తీసుకుంటారో చూస్తా” అంటూ ఓటర్లకు దంకీలు
ప్రజలకు సేవ చేయాల్సిన డీలర్ బెదిరింపులపై ఆగ్రహం
ఓటర్లను టార్గెట్ చేస్తూ అవమానకర వ్యాఖ్యలు
కలెక్టర్, ఎమ్మార్వోలకు ఫిర్యాదు చేయనున్న బాధితులు
కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి : కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల అనంతరం కొన్ని డివిజన్లలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. తాజాగా 28వ డివిజన్‌లో ఓటమి చెందిన అభ్యర్థి బంధువులుగా ఉన్న రేషన్ డీలర్ ఓటర్లపై బూతులు తిట్టుతూ బెదిరింపులకు పాల్పడుతున్న ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమే అయినప్పటికీ, ఓటమిని జీర్ణించుకోలేక ప్రజలపై అసభ్యకరంగా ప్రవర్తించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లకు జరిగిన ఎన్నికల్లో భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేశారు. ప్రజలు తమకు నచ్చిన అభ్యర్థులను ఎన్నుకుని కార్పొరేటర్లుగా గెలిపించగా, మిగిలిన వారు ఓటమిపాలయ్యారు. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండు రోజుల తర్వాత కూడా ఓటమిని అంగీకరించలేక కొందరు వ్యక్తులు ఓటర్లను లక్ష్యంగా చేసుకుని అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
రేషన్ కోసం వచ్చిన వారిపై బూతులు
28వ డివిజన్‌లో ఓడిపోయిన అభ్యర్థి బంధువులు గత కొంతకాలంగా రేషన్ డీలర్‌గా కొనసాగుతున్నారు. తమ బంధువు ఓడిపోవడంతో రేషన్ కోసం వచ్చే ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ “అందరూ కలిసి మా వాడిని ఓడించారు” అంటూ బూతులు తిట్టుతున్నట్లు బాధితులు తెలిపారు. రేషన్ తీసుకోవడానికి వచ్చే ప్రజలను అవమానిస్తూ మాట్లాడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రతి నెల రేషన్ కోసం ప్రజలు రావాల్సిందేనని, అప్పుడు ఎలా వస్తారో చూస్తామని ఇండైరెక్ట్‌గా బెదిరింపులు చేస్తున్నట్లు ఓటర్లు చెబుతున్నారు. ప్రజలకు సేవ చేయాల్సిన రేషన్ డీలర్ ఇలా రాజకీయ కారణాలతో బెదిరింపులకు పాల్పడటం సరైంది కాదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత రెండు దశాబ్దాలుగా ప్రజల ఓట్లతో ఎదిగిన నాయకులు, వారి బంధువులు ఇప్పుడు ఓటమి చవిచూడగానే అసలు స్వరూపం బయటపడుతోందని 28వ డివిజన్ ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రజలకు నిత్యావసర సరుకులు అందించాల్సిన బాధ్యత ఉన్న వ్యక్తులు రాజకీయాలకు అనుగుణంగా ప్రవర్తించడం అనైతికమని పేర్కొన్నారు.
అధికారులకు ఫిర్యాదు
ఈ ఘటనపై బాధితులు సోమవారం జిల్లా కలెక్టర్, ఎమ్మార్వోలకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. రేషన్ డీలర్‌పై తక్షణ చర్యలు తీసుకుని ప్రజలకు భరోసా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత ఉన్న వ్యక్తులు బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


