డేంజర్ స్పాట్‌గా రైల్వే అండర్‌బ్రిడ్జి
రహదారి మధ్యలో భారీ గుంతలు
బయటకు లేచిన ఐరన్ చువ్వలు
నిత్యం వాహనదారులకు ముప్పు
కొత్తగూడెంలో ఆర్యూబీని ఎవరు పట్టించుకోరా..?!
కాకతీయ, కొత్తగూడెం : కొత్తగూడెం పట్టణంలోని రైల్వే అండర్ బ్రిడ్జి వాహనదారులకు డేంజర్ స్పాట్‌గా మారింది. అండర్ బ్రిడ్జి రహదారి మధ్యలో పెద్దపెద్ద గుంతలు ఏర్పడటంతో ప్రమాదం పొంచి ఉన్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జికి ఇరువైపులా రహదారిపై కంకర పూర్తిగా లేచి, లోతైన గుంతలు ఏర్పడిన పరిస్థితి నెలకొంది. గుంతల్లో నుంచి ఇనుప చువ్వలు పైకి లేచి ఉండటంతో ద్విచక్ర వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

ఇనుప చువ్వలతో ప్రాణహాని ముప్పు
రోడ్డు మధ్యలో బయటపడిన ఐరన్ చువ్వల కారణంగా ప్రమాదాలు జరిగి తీవ్ర గాయాలు కావడంతో పాటు ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉందని ప్రజలు హెచ్చరిస్తున్నారు. రాత్రి వేళల్లో ఈ మార్గంలో ప్రయాణించడం మరింత ప్రమాదకరంగా మారిందని వాహనదారులు చెబుతున్నారు. నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ఈ అండర్ బ్రిడ్జిలో గుంతలు ఏర్పడినప్పటికీ, నెలల తరబడి మరమ్మత్తులు చేపట్టకపోవడం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు కలవరపడుతున్నారు. ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం వాటిల్లేలోపు అండర్ బ్రిడ్జి రహదారి మధ్యలో ఏర్పడిన గుంతలను తక్షణమే పూడ్చి, శాశ్వత మరమ్మత్తులు చేపట్టాలని ప్రజలు సంబంధిత అధికారులను డిమాండ్ చేస్తున్నారు.



