- వంతెన మధ్యలో గుంతలు
- బయటికి తేలిన ఇనుపచువ్వలు
- ఆందోళనలో వాహనదారులు
- మరమ్మతులు చేపట్టాలంటున్న ప్రజలు
కాకతీయ, కొత్తగూడెం రూరల్: ప్రతీ ఏడాది వర్షాకాలంలో రైల్వే అండర్ బ్రిడ్జితో ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. భారీ వర్షం కురిసింది అంటే చాలు బ్రిడ్జి మధ్యలో వరద నీరు చేరి చెరువును తలపిస్తుంటుంది. అంతేకాకుండా వరద నీరు నిల్వ ఉండడం మూలంగా గుంటలు ఏర్పడి సిసి రోడ్డు నుండి ఇనుప చువ్వలు బయటికి వచ్చి ప్రమాదాలకు సూచికగా నిలుస్తున్నాయి. అయినా ఈ సమస్య ఆందోళన కలిగిస్తున్నప్పటికీ అధికారులు పరిష్కారానికి సరైన చర్యలు తీసుకోవడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. వారం రోజులుగా జిల్లా కేంద్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో బ్రిడ్జి మధ్యలో ఉన్న దారిపై కంకర కొట్టుకుపోయి మీటర్ పొడుగునా ఐరన్ చువ్వలు బయటికి వచ్చి ప్రమాదకరంగా ఉన్నాయి.
రాత్రి వేళలో ఈ ఇనుప చువ్వల వల్ల మరింత ప్రమాదం పొంచి ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ప్రజలు కోరుతున్నారు. కొత్తగూడెం బస్టాండ్ నుండి రైల్వే అండర్ బ్రిడ్జి మీదుగా పాల్వంచ, భద్రాచలం, ఇల్లందు, బయ్యారం, మహబూబాద్, వరంగల్, కరీంనగర్, నిజాంబాద్ ఊర్లకు నిత్యం బస్సు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇనుప చువ్వల వల్ల వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయి. బ్రిడ్జికి ఇరువైపులా ఇసుక మేటలు ఉన్నాయి. ఇసుక కుప్పల ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. ఇసుకను, బ్రిడ్జి వద్ద వేలాడుతున్న ప్రైవేట్ కేబుల్ వైర్లను తొలగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


