రాహుల్ ఆలోచనల మేరకే పాదయాత్ర
ప్రజల్లోకి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు తీసుకెళ్లడమే కాంగ్రెస్ లక్ష్యం
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తామన్న నేతలు
హనుమకొండలో జనహిత పాదయాత్ర సన్నాహక సమావేశం
కాకతీయ, హనుమకొండ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మీనాక్షి నటరాజన్ చేపట్టిన జనహిత పాదయాత్ర విజయవంతం చేయాలని హనుమకొండ లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశంలో కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, సీతక్క, వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీపీసీసీ నాయకులు, మేయర్ గుండు సుధారాణి తదితరులు హాజరయ్యారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఆలోచనల మేరకు చేపడుతున్న ఈ పాదయాత్ర ద్వారా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. 20 నెలల్లో దేశంలో ఎక్కడా చూడని అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో అమలు అవుతున్నాయని, వాటిని ప్రజలకు చేరవేయడమే ఈ యాత్ర ఉద్దేమని అన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో పాదయాత్ర ఆగస్టు 25 సాయంత్రం 4 గంటలకు ఇల్లంద మార్కెట్ నుండి వర్ధన్నపేట అంబేద్కర్ సెంటర్ వరకు పాదయాత్ర, ఆగస్టు 26 ఉదయం 6.30 గంటలకు వర్ధన్నపేట ఫిరంగిగడ్డ ప్రభుత్వ పాఠశాలలో శ్రమదానం, ఉదయం 10 గంటలకు ఐనవోలు మల్లికార్జున స్వామివారి దర్శనం, ఉదయం 11.30 గంటలకు వర్ధన్నపేట శివారు లక్ష్మి గార్డెన్స్‌లో జిల్లా కార్యకర్తల సమావేశం ఉంటుందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. మంత్రులు, నేతలు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతం, కార్యకర్తల అభివృద్ధి, పదవుల కేటాయింపులో చురుకుగా పని చేస్తామని చెప్పారు. సమావేశం ప్రారంభానికి ముందు ఇటీవల పరమపదించిన సీపీఐ సీనియర్ నేత సురవరం సుధాకర్ రెడ్డికి మౌనం వహించి నివాళులర్పించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.


