కాకతీయ, పినపాక: పినపాక తహశీల్దార్ కార్యాలయంలో మండలంలోని ప్రజా సమస్యలపై వినతులు తెలుసుకొని వాటి పరిష్కారానికై సోమవారం నాడు తహశీల్దార్ గొంది గోపాలకృష్ణ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలంలోని 71 గ్రామాలనుండి 6 అర్జీలు మాత్రమే రావడం విశేషం. వీటిలో ఇందిరమ్మ ఇళ్ళు, గృహజ్యోతి, పారిశుధ్య పనులు,పాఠశాల ప్రహరీ లకు సంబంధించిన వినతులు అందినట్లు తహశీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు.
అర్జీలను ఆన్లైన్ లో నమోదు చేసి సంబంధిత శాఖలకు పంపనున్నట్లు తెలిపారు. ప్రతీ సోమవారం ప్రజా వాణి కార్యక్రమం ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు జరుగుతుందన్నారు. మండలంలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైన ప్రజా వాణి కార్యక్రమానికి మండల పరిషత్, వ్యవసాయ శాఖ, వైద్య, ఎన్ఆర్ఈజీఎస్, ఆర్ అండ్ బి, మిషన్ భగీరథ అధికారులు మాత్రమే హాజరైనారు. మిగతా శాఖల అధికారుల జాడ కానరాలేదు. వచ్చిన అధికారులు కూడా పూర్తి స్థాయిలో సమయం కేటాయించలేదు. కొంత మంది అధికారులు మొహాలు మాత్రమే చూపెట్టదలచారు. ప్రజా వాణి కార్యక్రమం ఆకాంక్షను నెర వేరదలచిన వారైతే అన్ని శాఖల సమన్వయంతో ప్రజా వాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తే కార్యక్రమం పట్ల ప్రజల్లో ఆసక్తితో పాటుగా నమ్మకం కలుగుతుందనేది ప్రజలు అంటున్నారు.


