- స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్ లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డితో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. కొణిజర్ల మండలానికి చెందిన నారీ మహిళా సేవా సంఘం సభ్యులు తమకు స్వయం ఉపాధి కల్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, జిల్లా గ్రామీణ అభివృద్ధికి అధికారికి రాస్తూ తగు చర్యలు చేపట్టాలని సూచించారు. ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెం గ్రామానికి చెందిన వాకర్స్ సాగర్ కాల్వ పక్కన ఉన్న రహదారి వద్ద ప్రజలు బహిరంగ మలవిసర్జన చేస్తున్నారని, దీనిని నివారించి అక్కడ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, ఖమ్మం రూరల్ ఎంపీడీవో కు రాస్తూ ఓడిఎఫ్ స్టేటస్ చెక్ చేసి అక్కడ అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.
తిరుమలాయపాలేం మండలం జింకల గూడానికి చెందిన షేక్ ఇమామ్ సాబ్ 1979 లో ప్రభుత్వం అసైన్మెంట్ భూమి సర్వే నెంబర్ 262 నందు రెండు ఎకరాల ఇరవై గుంటల భూమి ఇచ్చారని, నేటి వరకు ఆ భూమి చూపించ లేదని తనకు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. సింగరేణి మండలానికి చెందిన కె. సురేష్ తమ ఇంటి స్థలాన్ని కొందరు దౌర్జన్యంగా ఆక్రమించుకుని అక్రమ నిర్మాణాలు చేసుకుంటున్నారని, తమకు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా డీ.ఎల్.ఎస్.ఏ. కార్యదర్శికి రాస్తూ నిబంధన ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలిపారు. పెనుబల్లి మండల కేంద్రం బిసి కాలనీకి చెందిన జి. కళావతి గ్రామ పంచాయతీ కార్యాలయంలో 1998 నుంచి స్వీపర్ గా పని చేస్తున్నానని, తనకు మే నెలలో 9500 జీతం వచ్చిందని, జూన్ నెల నుంచి తనతో వెట్టి చాకిరి చేయించుకుని రూ.3వేలు ఇస్తామని పంచాయతీ కార్యదర్శి బెదిరిస్తున్నారని, తనకు పూర్తి జీతం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, ఎంపిడిఓ పెనుబల్లికి రాస్తూ విచారణ చేసి చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో డీఆర్ఓ ఏ. పద్మశ్రీ, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


