- జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి; ప్రజావాణి దరఖాస్తులను ప్రాధాన్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులు జిల్లా అధికారులు తమ వద్ద పెండింగ్ లేకుండా చూడాలని, దరఖాస్తులను వెంట వెంటనే పరిష్కరించాలని అన్నారు.
ఖమ్మం నగరం వినోబా నవోదయ కాలనీవాసులు హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం భూదాన యజ్ఞ బోర్డు ఇచ్చిన స్థలంలో నివాసాలు ఏర్పరచుకున్న పేద ప్రజలకు విద్యుత్, మంచినీటి వసతి కల్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, కలెక్టరేట్ డి విభాగానికి రాస్తూ ప్రతిపాదనలను సమర్పించాలని కలెక్టర్ అన్నారు. మధిర మండలానికి చెందిన ఊటుకూరు రూతమ్మ, తమకు ప్రభుత్వం ఇచ్చిన ఎకరం భూమికి పట్టా పాస్ పుస్తకం జారీ చేసి రైతు భరోసా వంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, మధిర తహసిల్దార్ కు తగుచర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.వైరా మండలం బ్రాహ్మణపల్లికి చెందిన రాధ తమకు మంజూరు చేసిన ఇందిరమ్మ ఇంటిని బేస్మెంట్ వరకు నిర్మించుకున్నామని గ్రామంలో ఉన్న మిగతా లబ్ధిదారులకు డబ్బులు వచ్చాయని, రెండు నెలలు గడిచినా తనకు బిల్లు రాలేదని కోరగా పీడీ హౌసింగ్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
వేంసూరు మండలం మర్లపాడు గ్రామానికి చెందిన భీమిరెడ్డి పుల్లారెడ్డి ఎన్టీఆర్ కాలువ మధ్యలో సంచార జాతులకు చెందిన వారు సొంత స్థలాల్లో డేరాలు వేసుకొని నివాసం ఉంటున్నారని, వారికి అవసరమైన డ్రైనేజీ, విద్యుత్ సరఫరా, ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, పంచాయతీ రాజ్ ఏఈకు రాస్తూ తగుచర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. సత్తుపల్లి మండలానికి చెందిన నాగమణి తనకు ఒంటరి పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, ఎంపిడిఓకు కలెక్టర్ సిఫార్సు చేశారు. ప్రజావాణిలో డిఆర్ఓ ఏ. పద్మశ్రీ, జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏఓ కె. శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.


