ప్రజాసేవకులనే ఎన్నికల్లో గెలిపించాలి
సీపీఎం జిల్లా నేత కొండపల్లి శ్రీధర్
ఏరులై పారుతున్న మద్యం, డబ్బుల పంపిణీపై ఆందోళన
కాకతీయ/జూలూరుపాడు : మండలంలోని కొమ్ముగూడెం గ్రామపంచాయతీలో సీపీఎం పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి, వార్డు సభ్యులను గెలిపించాలని కోరుతూ సోమవారం ప్రచార ఆఖరి రోజు పంచాయతీ వ్యాప్తంగా ఇంటింటా విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారానికి అన్ని వర్గాల ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందని పార్టీ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కొండపల్లి శ్రీధర్ మాట్లాడుతూ… గ్రామపంచాయతీ పరిధిలో మంచినీటి సమస్య, డ్రైనేజీ, రోడ్ల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, వీటి పరిష్కారంలో గత పాలకవర్గం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రాజకీయాలకు అతీతంగా ఎన్నికలు జరుగుతున్నట్లు చెప్పుకుంటున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు జనరల్ ఎన్నికలను తలపించేలా డబ్బు, మద్యాన్ని విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నాయని ఆరోపించారు. మద్యం ప్రభావంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని, రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా నిరంతరం ప్రజల సమస్యల కోసం పనిచేసే ప్రజాసేవకులకే ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బానోతు మోతి, వార్డు సభ్యుల అభ్యర్థులు, పార్టీ నాయకులు భానోత్ ఇస్రా నాయక్, బిచ్చు, రూప, రవి, శంకర్, రమేష్, చిన్ని, రేణుక, భారతి, పార్వతి, జయ, అనిత తదితరులు పాల్గొన్నారు.


