కాకతీయ, కొత్తగూడెం రూరల్: భద్రాచలం సబ్ కలెక్టర్, కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయాల్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని భూసమస్యల పరిష్కారానికి ప్రజలు సుదూర ప్రాంతాల నుండి ప్రజావాణి కార్యక్రమానికి వస్తున్నందున వారి సౌకర్యార్థం డివిజన్ల వారీగా ప్రజావాణి నిర్వహణకు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. భద్రాచలం డివిజన్ పరిధిలోని ప్రజలు భూసమస్యల పరిష్కారం కోసం భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ప్రజావాణి నిర్వహిస్తారని చెప్పారు. కొత్తగూడెం డివిజన్ పరిధిలోని ప్రజలు భూసమస్యల పరిష్కారం కోసం కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో ప్రజావాణి నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఇతర సమస్యలపై దరఖాస్తు చేసుకునేవారు కలెక్టరేట్లోని ఇన్వార్డ్ నందు తమ దరఖాస్తులను అందజేసి రసీదు పొందగలరని, దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడుతారని కలెక్టర్ తెలిపారు.


