రేగులగండికి మౌలిక వసతులు కల్పించండి
ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు సీపీఎం వినతి
కాకతీయ, మణుగూరు : రేగులగండి గ్రామంలో రహదారి, కరెంటు, మంచినీటి వంటి మౌలిక సదుపాయాలను తక్షణమే కల్పించాలని సీపీఎం మండల కమిటీ సభ్యులు గుండి భీమయ్య ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును కోరారు. గురువారం ఎమ్మెల్యే నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి గ్రామ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా భీమయ్య మాట్లాడుతూ గ్రామంలో గత 20 నుంచి 25 సంవత్సరాలుగా మౌలిక సదుపాయాల కొరత కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు సౌకర్యం, రహదారి, మంచినీటి సరఫరా, సీసీ రోడ్ల ఏర్పాటు కోసం పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతి చేసినప్పటికీ పరిష్కారం కాలేదన్నారు. గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేను కోరారు. వినతిపత్రాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సమస్యలను సానుకూలంగా పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సంబంధిత అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, వార్డు సభ్యులు, శాఖ కార్యదర్శులు గుండి రమేష్, కారం భీమయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


