రాజ్యాంగ రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్
కాకతీయ, కొత్తగూడెం : భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత న్యాయస్థానాలు, న్యాయవాదులకే పరిమితం కాదని, ప్రతి పౌరుడిపైనా ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ స్పష్టం చేశారు. సమానత్వం, సామాజిక న్యాయం, సోదరభావం లక్ష్యాలతో రూపొందిన రాజ్యాంగ విలువలను పరిరక్షించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం కొత్తగూడెం క్లబ్‌లో ఐ.ఎల్.పీ.ఏ జాతీయ అధ్యక్షురాలు కె. సుజాత చౌదంతి అధ్యక్షతన నిర్వహించిన ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఐ.ఎల్.పీ.ఏ) తెలంగాణ రాష్ట్ర ఐదవ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, భారత రాజ్యాంగం కేవలం చట్టాల సంకలనం మాత్రమే కాకుండా దేశ ప్రజల జీవన విధానానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. మౌలిక హక్కులు, దిశానిర్దేశక సూత్రాలు అట్టడుగు వర్గాల అభ్యున్నతికి బలమైన ఆధారాలని చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో న్యాయవాదుల పాత్ర అత్యంత కీలకమని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చట్టాలపై అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఇటువంటి రాష్ట్ర స్థాయి సదస్సులు న్యాయవృత్తిలో నైతిక విలువలు, సామాజిక బాధ్యతలను పెంపొందించేందుకు దోహదపడతాయని తెలిపారు. ఐ.ఎల్.పీ.ఏ తెలంగాణ యూనిట్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి సరిత, న్యాయమూర్తులు కిరణ్ కుమార్, కవిత, రాజేందర్, సుచరిత, రవికుమార్, వినయ్ కుమార్, సూరెడ్డి, లక్కినేని సత్యనారాయణ,
ఐ.ఎల్.పీ.ఏ తెలంగాణ బాధ్యులు శాంసన్, దేవరాజ్ గౌడ్, లక్ష్మీదేవి, సైనీ నాగేందర్, అదనం కామర్ తదితరులు పాల్గొన్నారు.


