సైకిళ్లపై ప్రచారం చేయండి!
అభ్యర్థులకు మంత్రి జూపల్లి వినూత్న సూచన
ఆరోగ్యంతో పాటు ప్రజల్లో వ్యాయామ స్పృహ
అభివృద్ధి పనులే కాంగ్రెస్ గెలుపుకు బలం
కొల్లాపూర్‌లో ఇంటింటి ప్రచారం జోరు
కాకతీయ, కొల్లపూర్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రధాన బలమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం చేపడుతున్న పనులు ప్రజల మన్ననలు పొందుతున్నాయని ఆయన అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కొల్లాపూర్ పట్టణంలోని 16వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి పెబ్బేటి శేఖర్ గెలుపు కోసం మంత్రి గురువారం విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గడపగడపకూ తిరుగుతూ ప్రజలను నేరుగా కలిశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించి, గత ప్రభుత్వ పాలనకు – ప్రస్తుత ప్రభుత్వ పాలనకు ఉన్న తేడాను ప్రజలకు స్పష్టంగా వివరించారు. ప్రచారంలో భాగంగా మంత్రి మాట్లాడుతూ… కేవలం ఓట్లు అడగడమే కాకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు తెలియజేయడం ముఖ్యమన్నారు. పట్టణ సమగ్రాభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఓటర్లలో విశ్వాసం కల్పించే ప్రయత్నం చేశారు.
సైకిల్‌పై ప్రచారం – వినూత్న పిలుపు
ప్రచార సమయంలో మంత్రి జూపల్లి అభ్యర్థులకు ఆసక్తికరమైన, వినూత్న సూచనలు చేశారు. ప్రతి అభ్యర్థి శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకోవాలని, అందుకోసం ప్రచారంలో మోటార్ బైక్‌లకు బదులు సైకిళ్లను ఉపయోగించాలని సూచించారు. “అభ్యర్థులు సైకిళ్లపై తిరిగి ప్రచారం చేస్తేనే నేను కూడా ప్రచారానికి వస్తా” అని స్పష్టంగా చెప్పారు. సైకిల్ తొక్కడం వల్ల అభ్యర్థుల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, ప్రజల్లో వ్యాయామం పట్ల అవగాహన పెరుగుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. నేటి రోజుల్లో శారీరక శ్రమ తగ్గిపోయిందని, వ్యాయామంపై ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉందన్నారు. అభ్యర్థులు ఆదర్శంగా నిలిచి సైకిల్ ప్రచారం చేపడితే యువతలోనూ మంచి సందేశం వెళ్తుందని పేర్కొన్నారు. ఈ ఎన్నికలు కొల్లాపూర్ భవిష్యత్తును నిర్ణయించే కీలకమైన ఎన్నికలని మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొని అభ్యర్థి విజయానికి కృషి చేశారు.


