ముందస్తు అప్రమత్తతతో నష్టాల నివారణ
విపత్తుల నిర్వహణకు ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్
22న బూర్గంపాడులో మాక్ డ్రిల్
భద్రాద్రి కలెక్టర్ జితేష్ పాటిల్
కాకతీయ, కొత్తగూడెం : ప్రకృతి వైపరీత్యాలు, ఇతర విపత్తుల సమయంలో సమర్థవంతమైన స్పందనతో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు ముందస్తు అప్రమత్తత అత్యంత అవసరమని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో విపత్తుల నిర్వహణ కోసం ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ (ఈఓసి)ను పటిష్టంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. శనివారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందనలతో కలిసి జిల్లా కలెక్టర్ విపత్తుల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. విపత్తుల సమయంలో జిల్లాలో ఈఓసి కీలక పాత్ర పోషిస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇందులో జిల్లా స్థాయి అధికారులు, రెవెన్యూ, ఇరిగేషన్, వైద్య, ఫైర్, పోలీస్, ఎస్డిఆర్ఎఫ్, ఎన్డిఆర్ఎఫ్ తదితర విభాగాలు సభ్యులుగా ఉండాలని తెలిపారు. విపత్తు పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముందస్తు చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు అవసరమైన సామాగ్రి, వనరులు, కార్యాచరణ ప్రణాళిక సిద్ధంగా ఉంచాలని సూచించారు. వర్షపాతం వివరాలు, ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నీటిమట్టం, నీటి విడుదల, వంతెనలు, రోడ్ల ప్రస్తుత పరిస్థితి వంటి అంశాలపై రియల్ టైమ్ సమాచారం ప్రజలకు చేరవేయాలని ఆదేశించారు. జిల్లా మ్యాప్‌తో పాటు వరద ప్రభావిత ప్రాంతాల మ్యాపులు సిద్ధంగా ఉంచాలని తెలిపారు.
పునరావాస కేంద్రాల సిద్ధత
వరదలు సంభవించినప్పుడు క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన చర్యలు, పునరావాస కేంద్రాల గుర్తింపు, అక్కడ కల్పించాల్సిన సదుపాయాలు ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఆరోగ్య, అగ్నిమాపక, పోలీస్, రెవెన్యూ, విద్యుత్, తాగునీరు, మునిసిపల్ సేవలకు సంబంధించిన టోల్‌ఫ్రీ నంబర్లు, హెల్ప్‌లైన్ వివరాలపై విస్తృత ప్రచారం చేయాలని తెలిపారు. లైఫ్ జాకెట్లు, బోట్లు తదితర రక్షణ సామాగ్రి అందుబాటులో ఉంచాలని, పోలీస్ విభాగం ద్వారా సమాచార వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గోదావరి నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహించినప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టమైన కార్యాచరణ ఉండాలని, దీనిని ఆచరణలో పరీక్షించేందుకు ఈ నెల 22న బూర్గంపాడులో మాక్ డ్రిల్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మాక్ డ్రిల్ సందర్భంగా శాఖల మధ్య సమన్వయం, స్పందన వేగం, రక్షణ చర్యలు, సహాయక సేవల అందుబాటు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించాలని తెలిపారు.


