సైబర్ కేసులో పురోగతి ఏదీ..?!
ఉడతనేని వికాస్‌పై చట్టపరమైన చర్యలేవీ..?
సైబర్ కేసులో ఏ5గా ఉన్న రాజకీయ నేత బంధువు
విదేశీయుల నుంచి రూ. కోట్లలో దోపిడీ చేసినట్లుగా ఆరోపణలు
ఏ1 అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన ఖమ్మం పోలీసులు
ఏ5 దగ్గర ఆగిన దర్యాప్తు?.. రాజకీయ ఒత్తిళ్లతో కేసు దర్యాప్తులో స్లో
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : విదేశీయుల నుంచి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన సైబర్ క్రైం కేసులో ఓ నిందితుడి వ్యవహారం ఇప్పుడు ఖమ్మం పోలీస్ డిపార్ట్‌మెంట్, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణానికి చెందిన ఉడతనేని వికాస్ (ఏ5)గా ఉండగా.. ఈకేసులో అతడిపై ఎలాంటి చర్యలు లేవన్న చర్చ జరుగుతోంది. సైబర్ క్రైం కేసులో ఏ5గా ఉన్న నిందితుడి విషయంలో పోలీసులు వెనుకంజ వేస్తున్నట్లుగా ఓ చర్చ జరుగుతోంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాంతానికి చెందిన పోట్రు ప్రవీణ్ అండ్ గ్యాంగ్ ఎక్సట్రిక సోల్యూషన్స్ అనే సంస్థను నెలకొల్పి సైబర్ నేరాలకు పాల్పడినట్లుగా ఆరోపణలున్నాయి. ఈ గ్యాంగ్ చేతిలో ఆస్ట్రేలియా, కంబోడియా దేశాలకు చెందిన పలువురు ఈ గ్యాంగ్ చేతిలో మోసపోయినట్లు ఖమ్మం పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది.
ఉద్యోగాల పేరుతో.. రూ.కోట్లు కొల్లగొట్టారు..?!
ఈ వ్యవహారంపై మోదుగు సాయికిరణ్ అనే వ్యక్తి గత నెల 24న పెనుబల్లి (వీఎం బంజర) పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తామని ఆశ చూపి వారి పేర్లపై బ్యాంక్ అకౌంట్లు తెరిపించి, వాటిలోకి సైబర్ నేరాల ద్వారా రూ.కోట్లలో ఖాతాలకు మళ్లించుకున్నట్లుగా ఫిర్యాదులో ఆరోపించాడు. ఈ ఫిర్యాదుతో 234/2025 ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు 318(4), 319(2), 336(3), 338 r/w 3(5) బీఎన్ ఎస్, 66-డీఐటీ ఆక్ట్ సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఈ సైబర్ కేసులో ఎ1గా పోట్రు ప్రవీణ్, ఏ2గా పోట్రు కళ్యాణ్, ఏ3గా మోరంపూడి చిన్నకేశవులు, ఏ4గా జంజునూరి శివక్రిష్ణ, ఏ5గా ఉడతనేని వికాస్‌ను చేర్చారు. ఎక్సట్రిక సోల్యూషన్స్ అనే సంస్థను కేంద్రంగా చేసుకుని ఈ నేరాలు సాగించినట్లు ఎఫ్ఐఆర్‌లో ఉంది.
ఏ5 దగ్గర ఆగిపోయిన దర్యాప్తు..!
ఏ1 పోట్రు ప్రవీణ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు, ఉడతనేని వికాస్‌ను కూడా రిమాండ్ చేశారు. అయితే ఇక ఆ తర్వాత కేసులో పురోగతి లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అధికార పార్టీకి చెందిన ఓ కీలక నేతకు వికాస్ సన్నిహిత బంధువన్న చర్చ జరుగుతోంది. ఈనేపథ్యంలోనే వికాస్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా పోలీసులు మిన్నకుండిపోతున్నట్లుగా కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. వికాస్ అరెస్ట్‌పై రాజకీయ ఒత్తిళ్లు కూడా పోలీసులు వెనకడుగు వేయడానికి ప్రధాన కారణమని కూడా తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల్లోనూ ఉడతనేని వికాస్‌పై పలు సైబర్ క్రైం కేసులు ఉన్నట్లుగా తెలుస్తుండటం గమనార్హం. ఈ విషయంపై అటు మీడియాలోనూ కథనాలు వెలువడుతున్నా.. ఖమ్మం జిల్లా పోలీసులు ఈ అంశంపై పెద్దగా పట్టింపులేనట్లుగా వ్యవహరిస్తుండటం గమనార్హం. ఖమ్మం పోలీసుల వైఖరి వెలువడుతున్న అనుమానాలకు బలం చేకూర్చినట్లు అవుతోంది.


