ప్రశాంతంగా ఐదు మున్సిపాలిటీల పోలింగ్
భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన పోలీస్ కమిషనర్
స్వేచ్ఛాయుత ఓటింగ్‌కు పటిష్ట చర్యలు
కాకతీయ, ఖమ్మం : ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రక్రియ బుధవారం ప్రశాంతంగా కొనసాగుతోందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఎదులాపురం, వైరా, కల్లూరు, మధిర, సత్తుపల్లి మున్సిపాలిటీల పరిధిలో పోలింగ్ కేంద్రాలను ఆయన ప్రత్యక్షంగా సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్ సరళి, బందోబస్తు పరిస్థితులపై అడిషనల్ డీసీపీలు ప్రసాద్ రావు, రామానుజం, కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్ల నిర్వహణ సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఓటర్లు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా జరగేందుకు అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకున్నామని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా ఓటింగ్‌లో పాల్గొనాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. జిల్లావ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని, ఇప్పటివరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు నమోదు కాలేదని అధికారులు వెల్లడించారు.


