ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
పోలింగ్ సరళిని పరిశీలించిన ఎస్పీ రోహిత్ రాజు
కాకతీయ, కొత్తగూడెం : పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సరళిని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదివారం క్షుణ్ణంగా పరిశీలించారు. ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమైన రెండో విడత పోలింగ్ సందర్భంగా ఆయన వివిధ పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. చుంచుపల్లి మండలం రుద్రంపూర్, గౌతమ్‌పూర్, చుంచుపల్లి తండా, బాబు క్యాంప్, రామాంజనేయ కాలనీతో పాటు పాల్వంచ మండలం రంగాపురం, కేశవాపురం గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి, విధులు నిర్వర్తిస్తున్న అధికారులకు పలు సూచనలు చేశారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు అధికారులు, సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వహించారని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని తెలిపారు.


