పోలీస్ దందా!
మితిమీరుతున్న ఎస్సై, సీఐల ఆగడాలు
అక్రమార్జన కోసం కొందరు అడ్డదారులు
వ్యాపారులను పీడించి అక్రమ వసూళ్లు
కేసుల నుంచి తప్పిస్తామని లంచాల కోసం వేధింపులు
ఇసుక, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాకు సహకారం!
ఉన్నతాధికారుల హెచ్చరికలు బేఖాతర్
తాజాగా కేయూ పీఎస్‌లో ఏసీబీ దాడులు
రూ. 15 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎస్సై శ్రీకాంత్
పేకాట కేసు నుంచి తప్పించేందుకు లంచం డిమాండ్
2026 సంవత్సరంలో ఇదే ఏసీబీ మొదటి కేసు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొందరు ఖాకీలు కట్టు తప్పుతున్నారు. అక్రమార్జన కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. విధి నిర్వహణలో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్న ఉన్నతాధికారుల హెచ్చరికలను బేఖాతర్ చేస్తూ యథేచ్ఛగా వసూళ్ల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. వేటుపడుతున్నా లంచగొండి అధికారుల్లో మార్పు రావడంలేదు. అక్రమార్కులతో అంటకాగడం, దోపిడీదారులతో చేతులు కలపడం, చీకటి వ్యాపారాలకు సహకరించడంతోపాటు కేసుల్లో ఇరుక్కున్న వాళ్లను లంచాల కోసం బెదిరింపులకు దిగుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. పోలీస్ శాఖ ప్రతిష్టను దిగజార్చేలా కొందరు పని చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈక్రమంలోనే తాజాగా కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ఎస్సై శ్రీకాంత్ ఏసీబీ అధికారులకు పట్టుబడటం డిపార్ట్‌మెంట్‌లో సంచలనంగా మారింది. ఈ ఘటన పోలీస్ శాఖలో జరుగుతున్న అవినీతిపై మరోమారు చర్చకు తెరలేపింది.

లంచం కోసం ఎస్సై వేధింపులు
హనుమకొండ జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అధికారుల దాడులు కలకలంరేపాయి. కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీకాంత్ బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పేకాట కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోకుండా.. కేసును తేలిక చేసి, అతనికి అనుకూలంగా వ్యవహరించేందుకు ఎస్సై శ్రీకాంత్ రూ. 15వేల నగదును డిమాండ్ చేశారు. బాధితుడిని పదేపదే వేధిస్తూ డబ్బుల కోసం ఒత్తిడి చేయడంతో చేసేదేం లేక సదరు వ్యక్తి అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదును స్వీకరించిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో వల పన్ని గురువారం బాధితుడి నుంచి ఎస్సై శ్రీకాంత్ 15 వేల లంచం తీసుకుంటున్న సమయంలో దాడి చేసి పట్టుకున్నారు. ఎస్సై నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్న అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. కేయూ ఎస్సై శ్రీకాంత్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడడం జిల్లాలో చర్చనీయాంశమైంది. కాగా 2026 సంవత్సరంలో ఏసీబీ అధికారులు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేసు నమోదు చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
గత జనవరిలో సీఐ జగదీష్..
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో అవినీతి నిరోధకశాఖ దాడులు గత జనవరిలో కలకలంరేపాయి. తొర్రూరు సీఐ జగదీష్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో వరంగల్ రేంజ్ ఏసీబీ అధికారులు జనవరి 6న సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. తొర్రూరుకు చెందిన ఓ వ్యాపారిని సీఐ జగదీష్ రూ. 4 లక్షల లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో అధికారులు తొర్రూరు సీఐ కార్యాలయంలో దాడులు నిర్వహించి సీఐ జగదీష్‌ను అలుపులోకి తీసుకోవడం, లంచం వ్యవహారంలో ఓ సీఐని ఏసీబీ అరెస్టు చేయడం అప్పట్లో సంచలనం రేకెత్తించింది.
కమిషనరేట్‌లో వరుస ఘటనలు
2024 ఆగస్టులో వరంగల్ జిల్లా పర్వతగిరి ఎస్సై గుగులోత్ వెంకన్న అవినీతి నిరోధక శాఖ అధికారులకు
పట్టుబడిన సంగతి తెలిసిందే. స్టేషన్ బెయిల్ కోసం నిందితుడి నుంచి రూ. 40 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎస్సైతోపాటు డ్రైవర్‌ను అరెస్టు చేశారు. అదే సంవత్సరం పర్వతగిరి సీఐగా పనిచేస్తున్న ఈ శ్రీనివాస్ నాయక్‌తోపాటు వీఆర్‌లో ఉన్న ఎస్సై అనిల్ కుమార్‌ను అప్పటి సీపీ అంబర్ కిషోర్ ఝా సస్పెండ్ చేశారు. ఓ కేసులో నిందితుల నుంచి భారీ డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో సీపీ ఇద్దరిపై వేటు వేశారు. అదే విధంగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి ఎస్ఐ రాజ్‌కుమార్ అదే ఏడు డిసెంబర్ 20న సస్పెన్షన్‌కు గురయ్యాడు. అక్రమార్కులతో అంటకాగుతున్నాడనే ఫిర్యాదులపై విచారణ జరిపిన సీపీ అంబర్ కిషోర్ ఝా ఎస్సై రాజ్‌కుమార్‌పై చర్యలు తీసుకున్నారు.


